మనసు పెద్దది చేసుకోండి.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచన
"ఎన్నికలు దగ్గరకొచ్చాయి.. 45రోజులు మీరు మాకోసం కష్టపడండి.. ఐదేళ్లు మేము మీకోసం కష్టపడతాం." అని చెప్పారు మంత్రి కేటీఆర్.
ఎన్నికల వేళ మనసు పెద్దది చేసుకోండి అంటూ నేతలకు సూచించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీస్ ని ప్రారంభించిన ఆయన.. ఎన్నికల వేళ పక్క పార్టీలనుంచి వచ్చేవారి విషయంలో వైరం పెంచుకోవద్దని చెప్పారు. ఎవరు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ మళ్లీ గెలవాలి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలి అనే విషయాన్ని మనసులో పెట్టుకోవాలని అన్నారు. పార్టీ గెలవాలంటే అందర్నీ కలుపుకొని వెళ్లాలని, అందరి సహకారం కావాలని చెప్పారు.
Live: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRBRS https://t.co/ZDqDQi3GhO
— BRS Party (@BRSparty) October 16, 2023
ఎవరు ఎవర్ని కాపీకొట్టారు..
బీఆర్ఎస్ మేనిఫెస్టో తమని చూసి కాపీ కొట్టారని కాంగ్రెస్ నేతలంటున్నారని.. వారికి గట్టిగా బదులివ్వాల్సిన బాధ్యత నేతలపై ఉందన్నారు మంత్రి కేటీఆర్. రైతుబంధు నిధులు పెంచి ఇస్తామని చెప్పిందెవరని ప్రశ్నించారు..? రైతుబంధుని బీజేపీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పేరు పెట్టలేదా అన్నారు. మిషన్ భగీరథని కాపీకొట్టి హర్ ఘర్ జల్ అనే పథకం మొదలు పెట్టలేదా అన్నారు. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్, బీజేపీ.. రెండూ కాపీకొట్టాయని ఎద్దేవా చేశారు. ఎవరు ఎవర్ని కాపీకొట్టారో వారికే తెలుసన్నారు.
45రోజులు కష్టపడండి..
"ఎన్నికలు దగ్గరకొచ్చాయి.. 45రోజులు మీరు మాకోసం కష్టపడండి.. ఐదేళ్లు మేము మీకోసం కష్టపడతాం." అని చెప్పారు మంత్రి కేటీఆర్. జిల్లా పార్టీ ఆఫీస్ లో ప్రతి రోజూ రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టాలని సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతి ఆరోపణను ఖండించాలన్నారు. ప్రజలకు నిజానిజాలు చెప్పాలన్నారు. ఇది మనపార్టీ, మనం ఇటుక ఇటుక పేర్చుకుని నిర్మించుకున్న పార్టీ అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు కేటీఆర్. వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థ శాశ్వతం అని వివరించారు.