రిజర్వేషన్ల పెంపునకు బీఆర్ఎస్ డిమాండ్
రిజర్వేషన్లకు ముగింపు పలికాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు కొనసాగుతాయి అంటూనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే దురుద్దేశంతోనే ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ చేస్తున్నారన్నారు.
పెరిగిన జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని బీఆర్ఎస్ పార్టీ నేత కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. దాంతో ప్రస్తుతం దేశంలో షెడ్యూల్డ్ కులాల వారికి 15, షెడ్యూల్డ్ తెగలవారికి 7.5, బీసీలకు 27%, ఇతర వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కూడా బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్నారు. కానీ, పెరిగిన జనాభా ఆధారంగా షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్లను 18 శాతానికి , షెడ్యూల్డ్ తెగలకు 10 శాతానికి పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు.
వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని తాము ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం దొడ్డిదారిలో మొత్తం రిజర్వేషన్లని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని కడియం శ్రీహరి ఆరోపించారు. 2014లో బీజేపీ మేనిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఆ లెక్కన ఈ 8 ఏళ్ల కాలంలో 16 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సిందని, కానీ అందులో ఒక్క శాతం ఉద్యోగాలను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించలేకపోయిందని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ వెనుకబడిన వర్గాల వారికి అసలు రిజర్వేషన్లు పొందే అవకాశం లేకుండా చేస్తున్నారని కడియం వ్యాఖ్యానించారు.
రిజర్వేషన్లకు ముగింపు పలికాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు కొనసాగుతాయి అంటూనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే దురుద్దేశంతోనే ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ చేస్తున్నారన్నారు. సమసమాజం కోసం పాలకులు పనిచేయాలని బీఆర్ అంబేద్కర్ చెబితే.. నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం అసమానతలు పెంచడమే పనిగా పెట్టుకొని ముందుకెళ్తోందన్నారు.
కులాలు, మతాల మధ్య విద్వేషాలని పెంచడం ద్వారా రాజకీయాలు చేయాలని బీజేపీ భావిస్తోందని, ఈ ప్రయత్నంలో అధికంగా నష్టపోయేది దళిత వర్గాలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నేర గణాంకాలను పరిశీలిస్తే గడిచిన ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో దళిత, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు అసాధారణ స్థాయిలో పెరిగిపోయాయి అని కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఆహార అలవాట్ల పైన దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీలకు నాణ్యమైన విద్యను అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, ఒక్క తెలంగాణలో మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఇతర వర్గాలకు నాణ్యమైన విద్య అందుతోందని కడియం శ్రీహరి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ 8 ఏళ్లలో తెలంగాణలో అదనంగా 744 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అంతకుముందు తెలంగాణ ప్రాంతంలో కేవలం 303 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఈ స్థాయిలో గురుకుల పాఠశాలలు లేవని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధును అమలు చేస్తామని చెప్పారు. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో గిరిజన బంధుపైనా ప్రకటన వస్తుందని తాను అనుకుంటున్నట్టు కడియం శ్రీహరి వివరించారు.