Telugu Global
Telangana

అలంపూర్‌పై వీడని సస్పెన్.. అయోమయంలో గులాబీ కేడర్..!

ఇద్దరు నేతలతో బీఆర్ఎస్‌ కేడర్‌లో గందరగోళం మొదలైంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం.. ఇప్పటికీ తమ అభ్యర్థి ఎవరో చెప్పుకోలేకపోతుండటంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అలంపూర్‌పై వీడని సస్పెన్.. అయోమయంలో గులాబీ కేడర్..!
X

117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్.. అలంపూర్‌ టికెట్‌పై ఎటు తేల్చడం లేదు. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతున్నప్పటికీ.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారనేది క్లారిటీ లేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహం తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకూ బీఫామ్ మాత్రం అందుకోలేదు. మరోవైపు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాత్రం తన అనుచరుడికే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. వీరిద్దరితో పాటు మరో ముగ్గురు ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థి ఎవ‌రో తేల్చకపోవడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కులసంఘాలతో మీటింగ్‌లు ఏర్పాటు చేసి తనకే మద్దతివ్వాలని కోరుతున్నారు. కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారన్న ధీమాతో ప్రచారం చేస్తున్నారు అబ్రహం. ఇక చల్లా అనుచరుడు విజయుడు సైతం ప్రచారం ప్రారంభించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని తానేనని ఊరూరు తిరుగుతున్నాడు.

ఈ ఇద్దరు నేతలతో బీఆర్ఎస్‌ కేడర్‌లో గందరగోళం మొదలైంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం.. ఇప్పటికీ తమ అభ్యర్థి ఎవరో చెప్పుకోలేకపోతుండటంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

మొదట్లో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. అలంపూర్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. తర్వాత పరిణామాలు మారడంతో అబ్రహం బీఫామ్‌ పెండింగ్‌లో ఉంచారు కేసీఆర్. దీంతో అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి తన అనుచరుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

First Published:  3 Nov 2023 2:55 AM GMT
Next Story