బీజేపీలో విలీనం.. కొట్టిపారేసిన గులాబీ ఎంపీలు
విలీనం వార్తలపై తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు స్పందించారు. బీజేపీలో చేరిక వార్తలు ఊహజనితమని కొట్టిపారేశారు. విలీనం వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత K.R.సురేష్ రెడ్డి.
తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. పలువురు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఇలా ఉంటే.. జాతీయ రాజకీయాల్లోనూ బీఆర్ఎస్‌కు సంబంధించి రోజుకో వార్త ప్రచారంలో ఉంటోంది. ఇటీవల బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు జగదీప్ ధన్‌ఖర్‌ను కలిసిన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బీఆర్ఎస్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ ప్రచారం జోరందుకుంది.
కాగా, విలీనం వార్తలపై తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు స్పందించారు. బీజేపీలో చేరిక వార్తలు ఊహజనితమని కొట్టిపారేశారు. విలీనం వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత K.R.సురేష్ రెడ్డి. ఇక తప్పుడు వార్తలతో బీఆర్ఎస్‌పై బురద జల్లుతున్నారని ఎంపీలు మండిపడ్డారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. దీంతో లోక్‌సభలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇక రాజ్యసభలో ప్రస్తుతం గులాబీ పార్టీకి నలుగురు సభ్యులు ఉన్నారు. కె.ఆర్.సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి, దీవకొండ దామోదర్ రావు ఎగువ సభలో ఎంపీలుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత కె.కేశవరావు బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.