బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ..
రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీ బలం పెరుగుతోందని అన్నారు కిషన్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు ఈరోజు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్ తో కలసి ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ వారిద్దరికీ కాషాయ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. రాములు కుమారుడు భరత్ కు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం.
బీఆర్ఎస్ నేతలకు గేలం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో సహజంగానే ఆ పార్టీ నేతల్లో కొందరికి భవిష్యత్ పై ఆందోళ పెరిగింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్వ వైభవం దక్కించుకున్నా.. రాష్ట్రంలో ఐదేళ్లకాలం ప్రతిపక్షంలోనే కొనసాగాల్సిన పరిస్థితి. అందుకే కొందరు సిట్టింగ్ లు అటు ఇటు చూస్తున్నారు. కాంగ్రెస్ లో టికెట్లకు భారీ కాంపిటీషన్ ఉంది కాబట్టి పనిగట్టుకుని ఎవరినీ వారు ఆహ్వానించే పరిస్థితి లేదు. బీజేపీ మాత్రం బీఆర్ఎస్ పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పొలిటికల్ గేమ్ మొదలు పెట్టింది. తాజాగా నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములుని తమవైపు లాక్కుంది. మరింతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీ బలం పెరుగుతోందని అన్నారు కిషన్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చాలామంది బీజేపీ కండువాలు కప్పుకున్నారు. వారంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పొలిటికల్ గా యాక్టివ్ గా లేని జయసుధ వంటి వారిని కూడా పిలిచి మరీ కండువాలు కప్పారు బీజేపీ నేతలు. చేరికలతో తమ బలం పెరిగిందని అధిష్టానం ముందు గొప్పలు పోయారు కిషన్ రెడ్డి. ఇప్పడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. మరి రిజల్ట్ లో కూడా బీజేపీకి గత అనుభవమే ఎదురవుతుందేమో చూడాలి.