Telugu Global
Telangana

ఎండిన వరి పంటతో మండలికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు

రైతులకు మద్దతుగా శాసనసభకు ఎమ్మెల్యేలు

ఎండిన వరి పంటతో మండలికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు
X

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయని నిరసన తెలుపుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు బుధవారం శాసన మండలికి హాజరయ్యారు. ఎండిన వరిపంటను తీసుకొని కౌన్సిల్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా ఆకుపచ్చ కండువాలతో అసెంబ్లీకి బడ్జెట్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా పడ్డ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయని, ఈ ప్రభుత్వానికి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ తెలియకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా కేసీఆర్‌ చెరువులను పునరుద్దరించి వాటిని ప్రాజెక్టుల కాల్వలతో అనుసంధానం చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల ఆయకట్టు కింద పొలాలు ఎండిపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కూడా నాగార్జున సాగర్‌ కుడి కాలువ నుంచి 10 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తుకుపోతుంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందన్నారు. ఈ ప్రభుత్వ అసమర్థతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. హైదరాబాద్‌ లో వాటర్‌ ట్యాంకర్లు పెరిగాయనన్నారు. కేసీఆర్ ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆయనపై కోపంతో ఆ ప్రాజెక్టును వినియోగించకపోవడం సరికాదన్నారు. రైతుల పక్షాన తాము పోరాడుతూనే ఉంటామన్నారు.





First Published:  19 March 2025 11:26 AM IST
Next Story