నిమ్స్‌లో గురుకుల విద్యార్థినికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శ
ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్ధిని శైలజ,ఫ్యామిలీ సభ్యులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.
కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్ధిని శైలజ,ఫ్యామిలీ సభ్యులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా శైలజ అస్వస్థతకు గురైంది. విద్యార్థిని శైలజను పరామర్శించిన అనంతరం కవిత మీడియాలో మాట్లాడనున్నారు.
అంతకుముందే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలని మండిపడ్డారు. హాస్టళ్లలో పురుగులన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.