Telugu Global
Telangana

తెలంగాణ రైతులపై మీకెందుకంత అక్కసు..?

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. తన అస్త్రాన్ని ఏకంగా కాంగ్రెస్‌ అధినేతకే గురిపెట్టారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తే, ఏ రాజకీయ పార్టీకి ఏ సమస్య వస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు.

తెలంగాణ రైతులపై మీకెందుకంత అక్కసు..?
X

ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెంచాయి. రైతులకు ఉచిత విద్యుత్‌ అవసరం లేదంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార బీఆర్‌ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బీఆర్‌ఎస్‌ను కౌంటర్‌ చేసేందుకు కాంగ్రెస్‌ కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలకు దిగింది. ఉచిత విద్యుత్‌ను నీరుగారుస్తున్నారంటూ అధికార పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది టీ-కాంగ్రెస్‌.

తెలంగాణ పాలిటిక్స్‌లో మంటలు రాజేసిన ఉచిత విద్యుత్‌ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అటు బీఆర్‌ఎస్‌ నేతలు, ఇటు కాంగ్రెస్‌ నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. రెండు పార్టీల నేతలూ తమకు తాము రైతు పక్షపాతులమని ప్రకటించుకుంటున్నారు.

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. తన అస్త్రాన్ని ఏకంగా కాంగ్రెస్‌ అధినేతకే గురిపెట్టారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తే, ఏ రాజకీయ పార్టీకి ఏ సమస్య వస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ రైతాంగంపై మీకెందుకు అంత అక్కసు అంటూ రాహుల్‌గాంధీని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు కవిత.


రైతులకు మూడు గంటల కరెంట్‌ సరిపోతుందని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత కరెంట్‌ ఇవ్వడం చేతగాక, తెలంగాణ రైతులపై అక్కసు వెళ్ల‌గక్కుతారా? అని రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను బీఆర్‌ఎస్‌ కాపాడుతోందన్న కవిత.. ప్రతి ఒక్క రైతుకు గులాబీ పార్టీ అండగా ఉంటుందన్నారు.

First Published:  12 July 2023 10:51 AM IST
Next Story