Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు

శుక్రవారం ఈ కేసులో ప్రధాన పిటిషన్లపై తుది విచారణ చేపడతామని హైకోర్టు చెప్పడంతో.. ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు
X

బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన బీజేపీ ఏజెంట్లపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాకు విడుదల చేసిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఫామ్ హౌస్ కేసు దర్యాప్తును సీబీఐ లేదా హైకోర్టు నియమించే ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను తప్పించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తుషార్ వెల్లపల్లితో పాటు నిందితులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.

సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని.. ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా ఏసీబీతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ల తరపు లాయర్ వాదించారు. అయితే సెక్షన్ 17(బీ) ప్రకారం మెట్రోపాలిటన్ నగరాల్లో ఏసీపీ స్థాయి అధికారి పీసీ యాక్ట్ కేసులను విచారించవచ్చని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. 2003లో ఏసీబీ పరిధిని ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. దాని ప్రకారం పీసీ యాక్ట్ కేసులన్నీ ఏసీబీనే వాదించాలని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. కాగా, చట్టపరిధిలోని నిబంధనలకు లోబడే సిట్ దర్యాప్తు జరుగుతున్నట్లు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అవినీతి ఆరోపణల కేసులను ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని లేదని.. సాధారణ పోలీసులు కూడా దర్యాప్తు చేయవచ్చని అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు.

ఫామ్ హౌస్‌ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో సాక్ష్యాలను తెలంగాణ హైకోర్టుతో సహా అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుకు పంపినట్లు గతంలో సీఎం కేసీఆర్ మీడియాకు తెలిపారు. అప్పట్లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఆ ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు. కానీ తాజాగా వాటిని పరిశీలిస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీసీ కెమెరా ఫుటేజీలతో కూడిన సీడీలు, పెన్‌డ్రైవ్‌, ఎఫ్‌ఐఆర్‌ కాపీలు ఇవ్వాలంటూ పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరుపాల్సిన అవసరంలేదని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టును కోరారు.

ఇక అనుబంధ పిటిషన్లపై విచారణ అవసరం లేదని, సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన ప్రధాన పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ధర్మాసనాన్ని కోరారు. అనుబంధ పిటిషన్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం తమ దృష్టికి తీసుకొని రావాలని జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి తెలిపారు. కాగా, శుక్రవారం ఈ కేసులో ప్రధాన పిటిషన్లపై తుది విచారణ చేపడతామని హైకోర్టు చెప్పడంతో.. ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

First Published:  16 Dec 2022 7:36 AM IST
Next Story