నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. నల్లకోటుతో అసెంబ్లీ స్పీకర్
మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. ఆ వ్యాఖ్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ రోజు సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నల్ల బ్డాడ్జీలు ధరించి వచ్చారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తమ నిరసనకు గుర్తుగా అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రదర్శనగా అసెంబ్లీకి హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
శాసనసభలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా, సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. pic.twitter.com/82U4OoDCRx
— BRS Party (@BRSparty) August 1, 2024
నల్ల కోటుతో స్పీకర్..
ఈ రోజు సమావేశాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నల్లకోటులో రావడం విశేషం. ఆయన వస్తుండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. తమ ఆవేదన అర్థం చేసుకుని స్పీకర్ నల్లకోటులో సభకు వచ్చారని, తన నిరసనకు ఆయన మద్దతు తెలిపినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. స్పీకర్ తమ బాధను అర్థం చేసుకున్నారని చెప్పారు.
మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు సార్... హరీశన్న @BRSHarish pic.twitter.com/OJlWUTqMVK
— BRS News (@BRSParty_News) August 1, 2024
ఇక మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. ఆ వ్యాఖ్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర ఎమ్మెల్యేలు ఈ వాయిదా తీర్మానంపై సంతకాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సభకు, సభలోని సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు.