ఉన్న ఒక్క ఎమ్మెల్యేనూ లాగేశారు..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలమే.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో అధికార కాంగ్రెస్‌లో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే వార్తలను నిజం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలమే. తాజాగా వెంకట్రావు కూడా ప్లేటు ఫిరాయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. ఇప్పటికే పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్.. తెల్లం వెంకట్రావు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.