Telugu Global
Telangana

కాంగ్రెస్ లోకి వెళ్లను.. మాట మార్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

అనుచరులు, అభిమానులతో సమావేశమైన ప్రకాష్ గౌడ్ తాను పార్టీ మారబోనని వారికి మాటిచ్చారు.

కాంగ్రెస్ లోకి వెళ్లను.. మాట మార్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. నాలుగో వికెట్ గా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ ని వీడిపోతారనే ప్రచారం జరిగింది. దానికి బలం చేకూరుస్తూ ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేపో మాపో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అన్నారు. అయితే ఈరోజు సీన్ రివర్స్ అయింది. అనుచరులు, అభిమానులతో సమావేశమైన ప్రకాష్ గౌడ్ తాను పార్టీ మారబోనని వారికి మాటిచ్చారు. దీంతో ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పు వార్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.


ప్రకాష్ గౌడ్ దాదాపుగా పార్టీ మారేందుకే ఫిక్స్ అయ్యారు. అయితే చివరిసారిగా తన మద్దతుదారులతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకుందామనుకున్నారు. ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు. అయితే ఆయన పార్టీ మారడం తమలో ఎవరికీ ఇష్టం లేదన్నారు అనుచరులు. తామెవరం ఆయనతో కలసి నడవలేమని స్పష్టం చేశారు. ఆయన పార్టీ మారినా తామంతా బీఆర్ఎస్ లోనే ఉంటామన్నారు. దీంతో ప్రకాష్ గౌడ్ ఆలోచనలో పడ్డారు. క్యాడర్ లేకుండా కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్ల తనకు లాభం లేదని భావించారు. కాంగ్రెస్ లోకి వెళ్లినా కూడా సొంత అనుచరగణం లేకపోతే అక్కడ వలస నాయకుడిలాగా అవమానాలు భరించాలి. సొంత వర్గం లేకపోత కాంగ్రెస్ లో ఆయన్ను తీసి పారేసినట్టు చూస్తారు. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారు. బీఆర్ఎస్ లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు.

ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుందని, కాంగ్రెస్ లోకి వెళ్లొద్దని, ఆయన అభిమానులు, స్థానిక బీఆర్ఎస్ నేతలు సూచించారు. దీంతో ప్రకాష్ గౌడ్ వెనక్కి తగ్గారు. మీ అందరూ సమ్మతిస్తేనే పార్టీ మారతానని, మీకోసమే తాను ఉన్నానని వారికి చెప్పారు. అయితే పార్టీ మారతానని సీఎం రేవంత్ రెడ్డిని కలసి, ఇప్పుడు వెనకడుగు వేస్తే కాంగ్రెస్ నేతల వేధింపులు మొదలు పెడతారేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ లో కూడా ప్రకాష్ గౌడ్ మునుపటిలాగా ఇమిడిపోగలరా లేదా అనేది వేచి చూడాలి.

First Published:  20 April 2024 6:35 PM IST
Next Story