Telugu Global
Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ లు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవాల్లో పాల్గొనడంలేదు. రెండు గ్యారెంటీలను లాంఛనంగా అమలులో పెట్టినా జిల్లాలలో ఆ స్థాయి హడావిడి జరగలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ లు
X

సాధారణంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్ లు, జాతికి అంకితం చేయడం వంటి పనులు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చేస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయిన అధికార పార్టీ నేతలు కూడా.. ఇన్ చార్జ్ ల హోదాలో ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సహజంగా ఆహ్వానాలున్నా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదు. అయితే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా ప్రారంభోత్సవాలకు అలవాటు పడలేదు. ఈ దశలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవడం విశేషం.


అమీర్‌ పేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు సేవలను లాంఛనంగా ప్రారంభించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు తమ సహకారం ఎళ్లవేళలా ఉంటుందని చెప్పారాయన. కాంగ్రెస్‌ పార్టీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నప్పుడే ప్రజల్లో ప్రభుత్వాలపై విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవాల్లో పాల్గొనడంలేదు. రెండు గ్యారెంటీలను లాంఛనంగా అమలులో పెట్టినా జిల్లాలలో ఆ స్థాయి హడావిడి జరగలేదు. నేతలంతా ఇంకా గెలుపు సంబరాల్లోనే ఉన్నారు, ఎన్నికల బడలికతో కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం ఎమ్మెల్యే హోదాలో గ్యారెంటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రజోపయోగమైన కార్యక్రమాల్లో తమ సహకారం ఎల్లప్పుడూ ప్రభుత్వానికి ఉంటుందన్నారు. కొత్త సంప్రదాయానికి తెరతీశారు తలసాని.

First Published:  10 Dec 2023 4:54 PM IST
Next Story