Telugu Global
Telangana

కాసేపట్లో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. ఎమ్మెల్యే మైనంపల్లి హాట్ కామెంట్స్

కాసేపట్లో సీఎం కేసీఆర్ అధికారిక జాబితా ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలతో అసలు ఆయనకు టికెట్ ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.

కాసేపట్లో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. ఎమ్మెల్యే మైనంపల్లి హాట్ కామెంట్స్
X

కాసేపట్లో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటిస్తారనే అంచనాలున్నాయి. సిట్టింగ్ ల్లో చాలామందికి టికెట్లు ఖాయమనే సంకేతాలున్నాయి, కొందరికి మాత్రం టికెట్లు దక్కవని దాదాపుగా తేలిపోయింది. అయితే అంతలోనే వారు తమ మనసులో మాట బయటపెడుతున్నారు. టికెట్లు రావని తెలిసినా కొందరు వేచి చూసే ధోరణిలో ఉండగా, ఒకరిద్దరు మాత్రం లైన్ దాటుతున్నారు. వారిలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఒకరు. తిరుమల యాత్రలో ఉన్న ఆయన మంత్రి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.

ఒకటి కాదు, రెండు కావాల్సిందే..

తనకు మళ్లీ మల్కాజ్ గిరి టికెట్ ఖాయమైందని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే మైనంపల్లి, ఈసారి తన కొడుక్కి మెదక్ టికెట్ కావాలంటున్నారు. ఒకవేళ మెదక్ లో తన కొడుక్కి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే.. ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలుస్తామని చెప్పారు. ఒకరకంగా ఆయన ధిక్కార స్వరం వినిపించారు.

తమ కుటుంబానికి రెండు టికెట్లు కావాలని అడిగే క్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి హరీష్ రావుపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మైనంపల్లి. మెదక్ లో హరీష్ రావు నియంతలా వ్యవహరిస్తున్నారని, తన కొడుక్కి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సిద్ధిపేటకు వెళ్లి హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాసేపట్లో సీఎం కేసీఆర్ అధికారిక జాబితా ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలతో అసలు ఆయనకు కూడా టికెట్ ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. మొత్తమ్మీద బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే వాతావరణం వేడెక్కింది, విడుదల తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

First Published:  21 Aug 2023 2:11 PM IST
Next Story