మల్లారెడ్డి సంచలనం.. రాజకీయాలకు గుడ్‌బై.!
ఓ సారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. కార్యకర్తలు, ప్రజల మద్దతుతో ఓ సారి మంత్రిని కూడా అయ్యారని గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. మేడ్చల్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి ఇదే తనకు చివరి టర్మ్ అని చెప్పారు. ప్రస్తుతం తన వయస్సు 71 ఏళ్లు అన్న మల్లారెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఓ సారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. కార్యకర్తలు, ప్రజల మద్దతుతో ఓ సారి మంత్రిని కూడా అయ్యారని గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి. నియోజకవర్గ ప్రజలకు 95 శాతం న్యాయం చేశానన్నారు మల్లారెడ్డి. భవిష్యత్తులోనూ ప్రజా సేవ చేస్తానన్నారు. తనకు కొడుకులు, కూతుళ్లు, బంధువులు ఎవరైనా నియోజకవర్గ ప్రజలేనని భావోద్వేగానికి గురయ్యారు.
రాజీకీయాల్లో ఇవే నా చివరి 5 ఏళ్లు - మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి pic.twitter.com/rfkc6WxPsD
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2024
2014లో తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మల్లారెడ్డి.. ఆ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మేడ్చల్ నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఇక ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.