ఈటలతో ఆ సంభాషణ.. క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి
ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరికి ఏం చేశాడని గెలుస్తాడని ప్రశ్నించారు మల్లారెడ్డి. ఈటలకు క్యాడర్ లేదు, లీడర్ లేడు, ఓటర్ లేడని విమర్శలు చేశారు.
ఓ పెళ్లి వేడుకలో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి దానిపై క్లారిటీ ఇచ్చారు. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన మీటింగ్‌లో ఇలా మాట్లాడారు.
"ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌లో నాతోపాటు మంత్రిగా చేసిన వ్యక్తి. మాకున్న సాన్నిహిత్యంతో కనిపించగానే ఆలింగనం చేసుకున్నా.. ఆ స్థానంలో నా పగవాడు ఉన్నా అదే చేస్తా. ఎట్లుందన్నా మల్కాజ్‌గిరిలో పరిస్థితి అంటే.. గెలుస్తున్నవ్ అన్నా అని చెప్పా. ఏదో ఎంకరేజ్ చేయడానికి అలా చెప్పా. దాంట్లో తప్పేముంది?. లేకపోతే మొహం మీదనే నువ్వు ఓడిపోతున్నవ్ అని చెప్పాలా?. అలా ఎవరైనా చెప్తారా?" అని వివాదానికి ముగింపు పలికారు మల్లారెడ్డి.
ఏం చేశాడని ఈటల గెలుస్తాడు..?
ఈటల రాజేందర్ మల్కాజ్‌గిరికి ఏం చేశాడని గెలుస్తాడని ప్రశ్నించారు మల్లారెడ్డి. ఈటలకు క్యాడర్ లేదు, లీడర్ లేడు, ఓటర్ లేడని విమర్శలు చేశారు. ఈటల ఏమైనా లోకలా, నియోజకవర్గానికి ఏమైనా పనులు చేశాడా అని ప్రశ్నించారు. మల్కాజ్‌గిరితో ఈటలకు సంబంధమే లేదన్న ఆయన.. కేసీఆర్‌తోనే ఈటల ఎదిగారన్నారు. అంతకుముందు ఏమీ లేదని.. కోడిగుడ్లు అమ్ముకునేవాడని విమర్శలు గుప్పించారు.