కాంగ్రెస్ ఆరు హామీల ఖర్చు ఎంతంటే.. కడియం చెప్పిన నిజాలు
తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు కడియం. ఈ లెక్కన 119 నియోజకవర్గాలకు కలిపి 4.16 లక్షల ఇండ్లు ఈ ఏడాదిలో మంజూరైనట్లు చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకయ్యే ఖర్చుపై లెక్కలతో సహా బయటపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఆరు గ్యారంటీల అమలుకయ్యే ఖర్చుపై ప్రాథమిక అంచనా వేస్తే ఏటా దాదాపు 1.36 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. ఇక రైతు రుణమాఫీ, రైతు, యువత డిక్లరేష్లన్లు, బీఆర్ అంబేద్కర్ అభయహస్తం అయ్యే ఖర్చు అదనమన్నారు. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయన్నారు కడియం.
ఇక తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు కడియం. ఈ లెక్కన 119 నియోజకవర్గాలకు కలిపి 4.16 లక్షల ఇండ్లు ఈ ఏడాదిలో మంజూరైనట్లు చెప్పారు. ఈ లెక్కన ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున వేసుకుంటే దాదాపు ఏడాదికి 23 నుంచి 24 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. కానీ, బడ్జెట్‌లో 7 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు కడియం. ప్రభుత్వం హామీల అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ ఆరు హామీలకు అయ్యే బడ్జెట్ను లెక్కలతో సహా తేల్చిచెప్పిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి pic.twitter.com/6fdYMJwlTv
— Telugu Scribe (@TeluguScribe) February 14, 2024
ఇక మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయంకు అయ్యే ఖర్చులపైనా మాట్లాడారు కడియం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటి 65 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రతి మహిళకు ఇవ్వకపోయినా రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని.. ఇందులో రేషన్ కార్డుకు ఒక్కరికి చొప్పున సాయం అందించినా దాదాపు 20 వేల కోట్లు అవసరమవుతాయన్నారు కడియం. ఇక చేయూత కార్యక్రమం కింద పెన్షన్లు పెంచుతామని, ఇంట్లో భార్యకు, భర్తకు సైతం పెన్షన్ ఇస్తామన్నారని చెప్పారు కడియం. ఏటా చేయూత కోసం దాదాపు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ నేతలు చాలా ఆర్బాటంగా ప్రచారం చేశారని.. ఈ ఆరు గ్యారంటీలే కాంగ్రెస్‌ను గెలిపించాయన్నారు కడియం శ్రీహరి. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ నేతలు అదే ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారంటూ విమర్శించారు.