Telugu Global
Telangana

రేవంత్ ఇదిగో నా రాజీనామా.. గన్‌పార్క్‌ వేదికగా హరీష్‌ సవాల్

రాజీనామా లేఖతో గన్‌పార్క్‌ వద్దకు వెళ్లి సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్ విసిరారు హరీష్‌రావు. "ఇదిగో నా రాజీనామా లేఖ. మీరు కూడా మీ రాజీనామా లేఖతో గన్‌ పార్క్ వద్దకు రావాలి. మీకు రావడం మొహమాటంగా ఉంటే మీ సిబ్బందితోనైనా రాజీనామా లేఖ పంపించాలి.

రేవంత్ ఇదిగో నా రాజీనామా.. గన్‌పార్క్‌ వేదికగా హరీష్‌ సవాల్
X

సీఎం రేవంత్ రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ‌లో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. పార్లమెంట్ ఎన్నికలవేళ రాజీనామాలకు సిద్ధమని ఇరువురు ప్రకటించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. స్పీకర్‌కు తన రాజీనామా లేఖ సమర్పించారు. ఆగస్టు 15లోపు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే తన రాజీనామా ఆమోదించాలని లేఖలో స్పీకర్‌ను కోరారు హరీష్‌రావు.

గన్‌పార్క్‌ వేదికగా హరీష్‌ సవాల్..

అంతకుముందు రాజీనామా లేఖతో గన్‌పార్క్‌ వద్దకు వెళ్లి సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్ విసిరారు హరీష్‌రావు. "ఇదిగో నా రాజీనామా లేఖ. మీరు కూడా మీ రాజీనామా లేఖతో గన్‌ పార్క్ వద్దకు రావాలి. మీకు రావడం మొహమాటంగా ఉంటే మీ సిబ్బందితోనైనా రాజీనామా లేఖ పంపించాలి. మీరు చెప్పిందే నిజమైతే తప్పకుండా రావాలని డిమాండ్ చేస్తున్నా. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. స్పీకర్‌ ఫార్మట్‌లో రాజీనామా లెటర్‌ రెడీగా ఉంది. ఇదంతా రాజకీయం కోసం కాదు. మాకు ప్రజలు ముఖ్యం, వారి సంక్షేమం ముఖ్యం. ప్రజలకు మేలు జరిగితే మాకు అంతేచాలు. మేమేం కొత్త డిమాండ్లు అడగటం లేదు, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఇచ్చిన హామీలే నెరవేర్చమని అడుగుతున్నాం" అన్నారు హరీష్‌రావు.

రేవంత్ ఏం చేస్తారు?

హరీష్‌రావు అన్నంత పనిచేశారు. రాజీనామా లేఖ స్పీకర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో హరీష్‌ రావు సవాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సవాళ్లు, ప్రతి సవాళ్లతో పెరిగిన పొలిటికల్ హీట్‌ రాజీనామాలతో మరింత రసవత్తరంగా మారింది.

First Published:  26 April 2024 11:44 AM IST
Next Story