Telugu Global
Telangana

తెలంగాణపై కుట్రతోనే చంద్రబాబు పర్యటనలు.. మండిపడ్డ బీఆర్ఎస్ మంత్రులు

ఖమ్మం జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టైనా చంద్రబాబు కట్టినట్లు నిరూపిస్తే.. తాను ముక్కును నేలకు రాస్తానని అజయ్ కుమార్ సవాలు చేశారు.

తెలంగాణపై కుట్రతోనే చంద్రబాబు పర్యటనలు.. మండిపడ్డ బీఆర్ఎస్ మంత్రులు
X

తెలంగాణపై కుట్రతోనే చంద్రబాబు పర్యటనలు.. మండిపడ్డ బీఆర్ఎస్ మంత్రులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడంపై బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం తన వల్లే అభివృద్ధి జరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఆయన వల్లే మన రాష్ట్రానికి మొదటి నష్టం జరిగిందని మండిపడ్డారు. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ముఖ్య కారణం చంద్రబాబే అన్నారు. 440 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా గుంజుకున్నారని ఆరోపించారు.

ఖమ్మం జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టైనా చంద్రబాబు కట్టినట్లు నిరూపిస్తే.. తాను ముక్కును నేలకు రాస్తానని అజయ్ కుమార్ సవాలు చేశారు. ఖమ్మంకు ఐటీని తెచ్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌దే అని పువ్వాడ స్పష్టం చేశారు. చంద్రబాబు సభ పెట్టిన గ్రౌండ్ చాలా చిన్నదని, అక్కడికి కూడా ఏపీ నుంచి జనాలను తరలించారని ఆరోపించారు. తెలంగాణలో కుట్రలు చేయడానికే చంద్రబాబు పర్యనటలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాసగౌడ్ అన్నారు. ఒకనాడు తెలంగాణ పదాన్ని నిషేధించిన వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు.

ఉద్యోగులను రాచి రంపానపెట్టి, నిరుద్యోగుల పొట్ట కొట్టారని చంద్రబాబుపై మండిపడ్డారు. పాలమూరు పేరు చెప్పుకొని ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తెచ్చి.. తెలంగాణ వాదాన్ని అణచి వేశారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అంగన్‌వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఖమ్మంలో కూడా జై తెలంగాణ అని చంద్రబాబు అనలేదన్నారు. బాబును చూస్తుంటే పంచతంత్ర కథలోని పులి-బాటసారి-బంగారు కడియం కథ గుర్తు కొస్తుందన్నారు. పులి చేతిలో మోసపోయే బాటసారి.. నేటి తెలంగాణా కాదని బాబుకు హితవు పలికారు.

టీడీపీ పాత బిడ్డలారా రండి అని చంద్రబాబు పిలుపునిస్తున్నారని, ఇదంతే రాష్ట్రాన్ని తిరిగి కలిపేయడానికి చేస్తున్న కుట్రే అని గంగుల కమలాకర్ అన్నారు. ఏపీ మూలాలున్న వ్యక్తికి తెలంగాణ గడ్డపై ఏం పనని గంగుల ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు జూన్ 2నే ఏర్పడినా.. చంద్రబాబు ఆ రోజు ప్రమాణం చేయలేదని.. ఏడు మండలాలను ఏపీలో కలిపేదాకా ప్రమాణం చేయనని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని గంగుల గుర్తు చేశారు. తెలంగాణలో ఏపీ పార్టీల చేత బీజేపీనే రాజకీయం చేయిస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్ సంపదను, మన నీళ్లను తీసుకొని వెళ్లే కుట్రలో భాగమే ఇదంతా అని కమలాకర్ ఆరోపించారు. తెలంగాణ రక్తం ఉన్న వాళ్లెవరూ చంద్రబాబు పార్టీలో చేరబోరని అన్నారు.

చంద్రబాబు గతంలో ప్రజలనే కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా పట్టించుకోలేదని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా ఏనాడూ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబని విమర్శించారు. చంద్రబాబు హయాంలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. కేసీఆర్ సీఎం అయ్యాకే అభివృద్ధి జరుగుతోందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

First Published:  22 Dec 2022 4:59 PM IST
Next Story