నేడే ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ సభ.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
ఈరోజు కేసీఆర్.. తన ప్రసంగంలో అమిత్ షా, మోదీపై ఎలాంటి చెణుకులు విసురుతారో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పై బీజేపీ చేస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ తో ముడిపెడుతూ చేస్తున్న ప్రచారంపై కూడా కేసీఆర్ స్పందించే అవకాశముంది.
మహారాష్ట్రలో ఇప్పటికే రెండు భారీ సభలు నిర్వహించింది బీఆర్ఎస్. ఈరోజు ఔరంగాబాద్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీనగర్ లోని జబిందా మైదానంలో బీఆర్‌ఎస్ సభ జరుగుతుంది. బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సహా కీలక నేతలు ఈ సభకు హాజరవుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన 150మంది ఆయన సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని సమాచారం. చేరికలేకాదు, కేసీఆర్ ప్రసంగం కూడా ఈ సభలో ప్రధాన అంశం కాబోతోంది.
Aurangabad decks up for massive BRS public meeting today.
— BRS Party (@BRSparty) April 24, 2023
There's an air of excitement and enthusiasm among people in Aurangabad and its neighbouring areas ahead of the third public meeting of the BRS in Maharashtra. pic.twitter.com/rHALbNQqLj
అమిత్ షా కాచుకో..
చేవెళ్ల సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి సెటైర్లు పేల్చారు, ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని చెప్పారు. అప్పటికప్పుడే మంత్రి కేటీఆర్ రివర్స్ కౌంటర్ ఇచ్చినా, ఈరోజు కేసీఆర్.. తన ప్రసంగంలో అమిత్ షా, మోదీపై ఎలాంటి చెణుకులు విసురుతారో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పై బీజేపీ చేస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ తో ముడిపెడుతూ చేస్తున్న ప్రచారంపై కూడా కేసీఆర్ స్పందించే అవకాశముంది. దేశ రాజకీయాలపై కూడా కేసీఆర్ స్పందిస్తారని సమాచారం.
ఇక మహారాష్ట్రలో కూడా తాజా రాజకీయ పరిణామాలు బాగా వేడెక్కాయి. అజిత్ పవార్ తీసుకునే నిర్ణయం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. షిండే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు అజిత్ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ దశలో మహారాష్ట్ర రాజకీయాలపై కూడా కేసీఆర్ కామెంట్ చేసే అవకాశముందని అంటున్నారు.
భారీ జన సమీకరణ..
రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో సభలు పెట్టినా బీఆర్ఎస్ కి ప్రజాదరణ విషయంలో ఢోకా లేదు. గతంలో నాందేడ్, కాందర్ లోహ సభల్లో బీఆర్ఎస్ సభలకు భారీగా జనం తరలి వచ్చారు. ఈరోజు జరిగే సభకు 50వేల మంది వస్తారని అంచనా. ఇవాళ కేసీఆర్ సమక్షంలో 150 మందికి పైగా నేతలు బీఆర్ఎస్ లో చేరతారు. వీరిలో ఛత్రపతి శంభాజీ నగర్ కార్పొరేషన్ కి చెందిన ౩౦ మంది కార్పొరేటర్లు ఉండటం విశేషం. త్వరలో మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ దశలో ౩౦ మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరడమంటే మామూలు విషయం కాదు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామంటున్నారు నాయకులు. ఔరంగాబాద్ సభను భారీ స్థాయిలో విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.