Telugu Global
Telangana

రేవంత్ తో తప్పుమీద తప్పు చేయిస్తున్న బీఆర్ఎస్

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కొనసాగించాలని, పొరపాటున కూడా ఎన్నికల వేళ ఆయన్ని మార్చొద్దంటూ బీఆర్ఎస్ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేస్తున్నారు.

రేవంత్ తో తప్పుమీద తప్పు చేయిస్తున్న బీఆర్ఎస్
X

ఉచిత విద్యుత్ విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. మూడు గంటలు కాదు బాబోయ్ మేం కూడా 24 గంటలే అంటున్నా బీఆర్ఎస్ ఒప్పుకోవడంలేదు. రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేయడంతో రేవంత్ రెడ్డికి ఊపిరాడటంలేదు. ఇక్కడ రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కి కూడా తిప్పలు తెచ్చిపెట్టాయి. కాంగ్రెస్ నేతలు కవరింగ్ ప్రెస్ మీట్లు పెడుతున్నా.. బీఆర్ఎస్ మాత్రం తగ్గడంలేదు. రైతు వేదికల వద్ద చేపట్టిన తీర్మానాలతో కాంగ్రెస్ పై మరింత ఒత్తిడి పెరిగినట్టయింది. ఈ దశలో మొదటి తప్పుని సరిదిద్దుకునే క్రమంలో పదే పదే రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ మరిన్ని సంచలన వ్యాఖ్యలకు వేదికగా మారింది.

రాజీవ్ గాంధీ భార్య ఇందిరాగాంధీ అంటూ రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్లో ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. తప్పు అని తెలిసినా దాన్ని సరిదిద్దుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు వేలెత్తి చూపిస్తున్నారు. ఇందిరాగాంధీ గురించి కనీసం అవగాహన లేకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే తల్లులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. రేవంత్ కి అవగాహన లేదని మండిపడ్డారు.

దొమ్మరల ఆగ్రహం..

మరోవైపు మంత్రి కేటీఆర్ ని విమర్శించే క్రమంలో దొమ్మరలతో పోలుస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. దొమ్మరల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేసింది. కాంగ్రెస్ ని ఓడించే వరకు దొమ్మరలు, సంచార జాతుల వారు నిద్రపోరని వార్నింగ్ ఇచ్చారు ఆయా సంఘాల నేతలు.

రేవంత్ ని మార్చొద్దు..

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కొనసాగించాలని, పొరపాటున కూడా ఎన్నికల వేళ ఆయన్ని మార్చొద్దంటూ బీఆర్ఎస్ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ఎన్నికలయ్యే వరకు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా కొనసాగితే బీఆర్ఎస్ 100 సీట్ల టార్గెట్ ని సునాయాసంగా చేరుకుంటుందని అన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు.

అప్పుడే అయిపోలేదు..

రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు వ్యాఖ్యలు ఎన్నికల వరకు హాట్ టాపిక్ గా ఉంచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రైతు వేదికల వద్ద నిరసన కార్యక్రమాలను ఏకంగా 10రోజులపాటు నిర్వహించాలనే ప్రణాళిక సిద్ధం చేశారు. రేవంత్ రెడ్డితోపాటు, కాంగ్రెస్ నేతలెవరూ గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. దీంతో రేవంత్ పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. వివరణ కోసం పెట్టిన ప్రెస్ మీట్లలో సైతం మరింత కలకలం రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

First Published:  18 July 2023 10:45 AM IST
Next Story