బీఆర్ఎస్ మేనిఫెస్టో.. రూ.400కే గ్యాస్ సిలిండర్
బీమా కోసం ఒక్కో కుటుంబానికి రూ.3,600 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అవుతుంది. అయినా సరే ఖర్చుకు వెనకాడకుండా ప్రజలందరికీ ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని గతంలోనే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరూ ఊహించని విధంగా సరికొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చింది. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలోని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. తెలంగాణలోని 94 లక్షల పై చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి. రైతు బీమా తరహాలోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 'కేసీఆర్ బీమా - ప్రతీ ఇంటికి ధీమా' పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.
ఈ బీమా కోసం ఒక్కో కుటుంబానికి రూ.3,600 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అవుతుంది. అయినా సరే ఖర్చుకు వెనకాడకుండా ప్రజలందరికీ ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని చెప్పారు. 'తెలంగాణ అన్నపూర్ణ' పథకం ద్వారా ప్రతీ రేషన్ కార్డు హోల్డర్‌కు వచ్చే ఏప్రిల్, మే నెల నుంచే సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకం అమలు చేయనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
ఆసరా పెన్షన్లను రూ.5వేలకు పెంచనున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చిలో రూ.3వేలకు పెంచుతాము. ఆ తర్వాత ప్రతీ ఏడాది రూ.500 చొప్పున పెంచుతూ 5 ఏళ్లు నిండే నాటికి రూ.5వేలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలు చేస్తామని అన్నారు. మార్చి నెలలో మొదట రూ.5వేలకు పెంచి.. ఆ తర్వాత ప్రతీ ఏటా రూ.300 చొప్పున పెంచుకుంటూ రూ.6వేలకు తీసుకొని వెళ్తామని అన్నారు.
'సౌభాగ్య లక్ష్మీ పథకం' ద్వారా బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి ఇస్తామని చెప్పారు. అలాగే అర్హులైన పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని అన్నారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్లు కలిగిన జర్నలిస్టులకు కూడా రూ.400కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న రైతు బంధును ఎకరాకు రూ.16వేలు చేస్తామని అన్నారు. తొలి ఏడాది రూ.12 వేలు చేసి.. ఆ తర్వాత విడతల వారీగా రూ.16వేలకు పెంచుతామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.15 లక్షలకు పెంచుతామని అన్నారు. జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని అన్నారు. దీనికి 'కేసీఆర్ ఆరోగ్య రక్ష'అనే పేరు పెడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.
అగ్రవర్ణ పేదల కోసం 119 గురుకులాలను ఏర్పాటు చేస్తామిని చెప్పారు. రాష్ట్రంలో 45 లక్షల మంది స్వశక్తి మహిళా గ్రూపులు ఉన్నాయి. పక్కా భవనాలు లేని గ్రూపులకు విడతల వారీగా ప్రభుత్వమే భవనాలు కట్టి ఇస్తుందని హామీ ఇచ్చారు. అసైన్డ్‌భూములపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తి వేస్తామని చెప్పారు. పట్టాదారుడు తన భూమిని అమ్ముకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మార్చాలని కోరుతున్నారు. దీన్ని ఆచరణాత్మకంగా ఎలా అవలంభించాలనే విషయంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. దాని రిపోర్టు ఆధారంగా కీలక నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.