Telugu Global
Telangana

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్!

అఖిల పక్ష భేటీలో కనుక బీఆర్ఎస్ ప్రతిపాదించిన అంశాలపై చర్చకు అనుమతించకపోతే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్!
X

కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించే యోచనలో ఉన్నది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ తమిళిసై తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ప్రభుత్వం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా, స్వయంగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెళ్లి చర్చలు జరిపినా వాటికి ఆమోదం లభించడం లేదు. దీంతో ప్రభుత్వ పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కేవలం తెలంగాణలోనే కాకుండా బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు ఆయా ప్రభుత్వాలకు సహకరించడం లేదు. దీంతో గవర్నర్ల తీరుపై ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ (సోమవారం) జరిగే అఖిల పక్ష భేటీలో వీటిపై ప్రశ్నించనున్నది. అంతే కాకుండా కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అదానీ విషయంలో ఎల్ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లడంపై, నిత్యావసర ధరలు, పెట్రో భారంపై పార్లమెంటులో చర్చకు అవకాశం కల్పించాలని అఖిల పక్షంలో అభ్యర్థించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.

అఖిల పక్ష భేటీలో కనుక బీఆర్ఎస్ ప్రతిపాదించిన అంశాలపై చర్చకు అనుమతించకపోతే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవసరం అయితే ఇతర ప్రతిపక్ష పార్టీల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు.

2002 బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా బీఆర్ఎస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, అప్రజస్వామిక విధానాలపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించారు. దీంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం 2014కు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని కేసీఆర్ సూచించారు.

First Published:  30 Jan 2023 8:33 AM IST
Next Story