Telugu Global
Telangana

పతకాలు తెస్తే గొప్పలు చెబుతారు.. సమస్యలొస్తే పట్టించుకోరా..?

అంతర్జాతీయ వేదికలపై గెలిచి భారత్ కోసం పతకాలు తెస్తే దేశం బిడ్డలంటూ గర్వంగా చెప్పుకుంటారని, ఇప్పుడు వీరంతా ఈ దేశం బిడ్డలా కాదా కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

పతకాలు తెస్తే గొప్పలు చెబుతారు.. సమస్యలొస్తే పట్టించుకోరా..?
X

భారత దేశానికి పతకాలు తెచ్చి, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు మారుమోగించిన రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఇతర నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లి రెజ్లర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వారికి తమ మద్దతు తెలిపారు. ఏకష్టం వచ్చినా తాము వారి వెంట నిలబడతామని చెప్పారు.

ఇప్పుడు దేశం బిడ్డలు కాదా..?

అంతర్జాతీయ వేదికలపై గెలిచి భారత్ కోసం పతకాలు తెస్తే దేశం బిడ్డలంటూ గర్వంగా చెప్పుకుంటారని, ఇప్పుడు వీరంతా ఈ దేశం బిడ్డలా కాదా కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కనీసం ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మన దేశం ఆడవారిని గౌరవంగా చూసుకుంటుందని, మన సంప్రదాయాల గురించి ఘనంగా లెక్చర్లు దంచే నేతలు, మన ఆడబిడ్డలకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు.


ఆడబిడ్డలను వేధింపులకు గురి చేసిన ఎంపీని బహిష్కరించాల్సిన బీజేపీ, ఆయనకే మద్దతుగా మాట్లాడటం దారుణం అని విమర్శించారు శ్రీనివాస్ గౌడ్. సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న రెజ్లర్ల వెంట ప్రతిపక్ష పార్టీలన్నీ ఉన్నాయని, ప్రతిపక్షాలున్నాయంటే, వారి వెనక ప్రజలున్నట్టే అర్థం చేసుకోవాలని చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవం జరిగిన వెంటనే, రెజ్లర్ల వద్దకు వెళ్లి సంఘీభావం తెలపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఆయన ఆదేశం మేరకు తాము రెజ్లర్ల శిబిరం వద్దకు వచ్చామని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజానీకమంతా రెజ్లర్లకు మద్దతు తెలుపుతోందని అన్నారు. దీక్షా శిబిరం వద్దకు బీఆర్ఎస్ నేతలు రాగానే కోలాహలం నెలకొంది. తమ కష్టాలు చెప్పుకున్న రెజ్లర్లకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  5 May 2023 6:37 AM IST
Next Story