రామన్న లేడుగా.. చలో కవితక్క! క్యూ కడుతున్న బీఆర్ఎస్ నేతలు
మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లడంతో ఎమ్మెల్సీ కవిత ఇంటికి క్యూ కడుతున్నారు. ఎలాగైనా తమకు టికెట్ ఇప్పించమని విన్నవించుకుంటున్నారు.
తిరిగి టికెట్ దక్కించుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఈసారైనా టికెట్ సంపాదించుకోవాలని ఆశావహులు.. ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చుట్టూ చక్కర్లు కొట్టిన నేతలంతా.. ఆయన అమెరికా వెళ్లడంతో కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత ఇంటికి క్యూ కడుతున్నారు. ఎలాగైనా తమకు టికెట్ ఇప్పించమని విన్నవించుకుంటున్నారు.
నిన్న బొంతు, బేతి.. నేడు రేఖానాయక్, సునీతా లక్ష్మారెడ్డి
ఉప్పల్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కవితను కలిశారు. తమపేరు ఎలాగైనా సిఫార్సు చేయాలని కోరారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే కవిత ఇంటిముందు నేతలు బారులు తీరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా కవితను కలిసి తమ పేరు సిఫార్సు చేయాలని విన్నవించి వెళ్లారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా చివరి ప్రయత్నంగా కవితను కలిసి వెళ్లనున్నారు.
బుజ్జగింపుల బాధ్యత కవితకు ఇచ్చారా..?
కేసీఆర్ మాటంటే మాటే.. ఆయన టికెట్ ఖరారు చేశాక ఇక తిరుగు ఉండదు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు కేటీఆర్ దగ్గరికి పరిగెట్టడం సహజం. వాళ్లకు సర్దిచెప్పలేకే కేటీఆర్ ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లారంటూ ప్రతిపక్షాలే కాదు సొంత పార్టీలోనూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల బాధ్యతను కల్వకుంట్ల కవితకు అప్పగించారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు ఆశావహులకు ఉన్న ఏకైక అవకాశం కవితక్క ఆశీసులే మరి!