Telugu Global
Telangana

ఆమె నిర్దోషి.. ధైర్యంగా ఉన్నారు

రాజకీయ దురుద్దేశంతో కవితపై కేసు పెట్టారని అన్నారు బీఆర్ఎస్ నేతలు. లాయర్‌కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థ‌మ‌వుతుందన్నారు.

ఆమె నిర్దోషి.. ధైర్యంగా ఉన్నారు
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిర్దోషి అని, ఆమె జైలులో ఉన్నా కూడా ధైర్యంగా కనిపించారని చెప్పారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రవీణ్ కుమార్ తీహార్ జైలులో కవితను కలిశారు. కవితను అన్యాయంగా జైలులో పెట్టారని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసులు పెట్టారని అన్నారు.


రాజకీయ దురుద్దేశంతో కవితపై కేసు పెట్టారని అన్నారు బీఆర్ఎస్ నేతలు. లాయర్‌కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థ‌మ‌వుతుందన్నారు. రాత్రికి రాత్రి జ‌డ్జిని మార్చినప్పుడే వారి దురుద్దేశాలు స్పష్టమయ్యాయని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తాయని, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారని, అవి ఎవరి ప్రయోజనాల కోసం అని అడిగారు. కవిత దగ్గర ఒక్క రూపాయి డబ్బు దొరకలేదని, ఈ కేసులో ఆమె దోషి ఎలా అవుతుందన్నారు ప్రవీణ్ కుమార్.

కవితపై ఒత్తిడి..

విచారణ పేరుతో కవితపై సీబీఐ, ఈడీ అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్. ఈ కేసులో మరింత మంది నాయకుల పేర్లు చెప్పాలని ఆమెను అడుగుతున్నారని, ఆమె ఒప్పుకోవడం లేదన్నారు. ఆమె నిర్దోషి అని, ఎప్పటికైనా ఆమె నిర్దోషిత్వం నిరూపించుకుంటుందన్నారు. బీజేపీలో చేరినవారిని మాత్రం ఈడీ, సీబీఐ ఏమీ చేయవని.. వారికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం కేసులు పెట్టి వేధిస్తారని అన్నారు. కేవలం విపక్షాల గొంతు నొక్కేందుకే బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను వాడుకుంటోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  17 May 2024 2:01 PM GMT
Next Story