Telugu Global
Telangana

ఆ పొరపాట్లు మళ్లీ జరగవు.. కార్యకర్తలకు కేటీఆర్ హామీ

గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని భరోసా ఇచ్చారు కేటీఆర్. కార్ కేవలం సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని, మళ్ళీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని చెప్పారు.

ఆ పొరపాట్లు మళ్లీ జరగవు.. కార్యకర్తలకు కేటీఆర్ హామీ
X

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కేవలం 4లక్షల ఓట్లు మాత్రమే తక్కువ తెచ్చుకుందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రం లో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యేదన్నారు. తక్కువ ఓట్ల తేడాతో ఏకంగా 14 సీట్లు కోల్పోయామని వివరించారు కేటీఆర్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని, మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్నారు.


ఎవరిది విధ్వంసకర మనస్తత్వం..?

కరెంటు బిల్లులు కట్టొద్దని తాను పిలుపునిస్తే తనది విధ్వంసకర మనస్తత్వం అని అంటున్నారని.. ఇది తాను చెప్పింది కాదని, గతంలో కాంగ్రెస్ నేతలే కరెంటు బిల్లులు కట్టొద్దని పిలుపునిచ్చారని గుర్తు చేశారు కేటీఆర్. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని స్వయానా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పారని, గత నవంబర్ నుంచే బిల్లులు కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపు నిచ్చారని అన్నారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా ? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు వచ్చిన కరెంటు బిల్లుల్ని సోనియాకు పంపేలా బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని సమాయాత్తం చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

పాలన మీద దృష్టి పెట్టిన బీఆర్ఎస్.. యూ ట్యూబ్ ఛానళ్ల లో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టలేకపోయిందని చెప్పారు కేటీఆర్. ఆన్ లైన్ లో రేషన్ కార్డులు ఇచ్చామని, ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలు వేయక పోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. ఇకపై మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవని భరోసా ఇచ్చారు. కార్ కేవలం సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని, మళ్ళీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని చెప్పారు కేటీఆర్.

మోదీకి, రేవంత్ రెడ్డి కి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని చెప్పారు కేటీఆర్. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. బీఆర్ఎస్ ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తానంటూ రేవంత్, భట్టితో ప్రధాని మోదీ అన్నట్టు ఇటీవల మీడియాలో వచ్చిందని.. దీంతో బీజేపీ బీ టీమ్ ఎవరో తేలిపోయిందన్నారు కేటీఆర్.

First Published:  21 Jan 2024 4:01 PM IST
Next Story