Telugu Global
Telangana

లడ్డు గుజరాత్ కి.. పిప్పర్ మెంట్లు తెలంగాణకి

తెలంగాణకు కేంద్రం నిధులివ్వకపోగా, రావాల్సిన నిధుల్ని ఆపేశారని అన్నారు హరీష్ రావు. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు.

లడ్డు గుజరాత్ కి.. పిప్పర్ మెంట్లు తెలంగాణకి
X

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కి లడ్డూలు ఇచ్చి, తెలంగాణను మాత్రం పిప్పర్ మెంట్లతో సరిపెట్టుకోమంటున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్శిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని విమర్శించారు. వరంగల్ వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లుడు తప్ప వారు చేసేందేమి లేదని ఎద్దేవా చేశారు. "ఏమన్నా అంటే ఈడీని ఉపయోగిస్తున్నారు.. మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉండవచ్చు.. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు.." అని అన్నారు హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకానికి పేరు మార్చి మోదీ ప్రభుత్వం కాపీ కొట్టిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది కాబట్టే తమ పథకాలు కాపీ కొడుతున్నారని, తమకి అవార్డులు కూడా ఇస్తున్నారని అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని స్వయానా మోదీ ఒప్పుకున్నారని, అంటే కేసీఆర్ సమర్థంగా పనిచేస్తున్నట్టేకదా అని అన్నారు హరీష్ రావు.

తెలంగాణకు కేంద్రం నిధులివ్వకపోగా, రావాల్సిన నిధుల్ని ఆపేశారని అన్నారు హరీష్ రావు. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదని అన్నారు. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని రూ. 21వేల కోట్లు ఆపేశారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే మోదీ కళ్లు మండిపోతున్నాయని అన్నారు.

వరంగల్ సభలో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అసలు తెలంగాణ ఉద్యమంలో మోదీ పాత్ర ఏంటి అని ప్రశ్నించారు. మోదీయే విశ్వాస ఘాతకుడన్నారు. ఆయన అద్వానీ, వెంకయ్యనాయుడిని తొక్కేసి పైకొచ్చాడని చెప్పారు. విభజన హామీలు అమలు చేయని మీరా నమ్మక ద్రోహులు ? మేమా ? అంటూ ప్రధానిని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మోదీ ప్రధాని అయిన తర్వాత ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మోదీ ప్రధాని అయితే బీసీలు సంతోషపడ్డారని, కానీ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖే లేదని ఎద్దేవా చేశారు శ్రీనివాస్ గౌడ్.

వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ పై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సర్కార్ పని అంటూ మండిపడ్డారాయన. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడ స్థానం ఇవ్వరని చెప్పారు. వరంగల్‌ కు వచ్చిన మోదీ తెలంగాణాకు మొండి చేయి చూపించారని, అక్కసు వెళ్లగక్కి వెళ్ళారని అన్నారు. కేసీఆర్ కీర్తి ఢిల్లీ తాకుతుందని మోదీకి భయం పట్టుకుందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

First Published:  8 July 2023 7:39 PM IST
Next Story