Telugu Global
Telangana

ఎన్నికల ముందే బీఆర్ఎస్ విజయోత్సవాలు.. ఊరూవాడా తీర్మానాలు

అక్కడితో ఆగకుండా తీర్మానాల కాపీలతో నాయకుల్ని కలుస్తున్నారు. మా ఓటు మీదే, మీరు ధీమాతో ఉండండి అని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ ఇదో కొత్త సంప్రదాయంగా మారింది.

ఎన్నికల ముందే బీఆర్ఎస్ విజయోత్సవాలు.. ఊరూవాడా తీర్మానాలు
X

అభ్యర్థులను ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ లో విజయోత్సవాలు మొదలయ్యాయి. "మీరు ప్రకటించిన అభ్యర్థికే మా ఓటు.." అంటూ నాయకులు, కార్యకర్తలు అంతా ముక్త కంఠంతో సీఎం కేసీఆర్ కి మద్దతు తెలుపుతున్నారు. గ్రామ గ్రామాన ర్యాలీలు చేపడుతున్నారు, పాలాభిషేకాలతో హోరెత్తిస్తున్నారు. అక్కడితో ఆగకుండా తీర్మానాల కాపీలతో నాయకుల్ని కలుస్తున్నారు. మా ఓటు మీదే మీరు ధీమాతో ఉండండి అని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ ఇదో కొత్త సంప్రదాయంగా మారింది.

కామారెడ్డితో మొదలు..

ఈ దఫా గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేస్తానంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ప్రజలు సంబరపడ్డారు. మాది సీఎం నియోజకవర్గం అని చెప్పుకుంటామని, మా నియోజకవర్గంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని మా బతుకులు మారిపోతాయంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాచారెడ్డి మండలంలోని పలు గ్రామపంచాయతీలు ఇప్పటికే సీఎం కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ తీర్మాన ప్రతులను తీసుకొచ్చి ఎమ్మెల్సీ కవితకు అందజేశారు. కేసీఆర్ ప్రచారానికి వచ్చినా, రాకపోయినా.. ఆయన్ను గెలిపించుకునే బాధ్యత తమదేనంటున్నారు ప్రజలు, స్థానిక నాయకులు.


హరీష్ కి మద్దతుగా తీర్మానాలు..

సిద్ధిపేటలో కూడా గెలుపు హరీష్ రావుదేనంటూ స్థానికులు తీర్మానాల కాపీలు రెడీ చేశారు. తామంతా ఆయన వెంటే ఉంటామని చెప్పారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్‌ కుల సంఘాల నేతలు మంత్రి హరీష్ రావును కలిసి ఏకగ్రీవ తీర్మానాలు అందజేశారు.

సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవెల్లి గ్రామ మత్స్య కారుల సహకార సంఘం నేతలు, ఇరుకోడ్ గ్రామ హనుమంతుపల్లి ముదిరాజ్ సంఘం నేతలు, సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ ముదిరాజ్ సంఘం నేతలు, సభ్యులు మంత్రి వద్దకు వచ్చి తామంతా ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నామని చెప్పారు. సిద్దిపేట ప్రజల ఆదరణ, ఆప్యాయత గుండెల్లో పెట్టుకుంటానన్నారు హరీష్ రావు. అంతా ఏకతాటి పై వచ్చి ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం.. బీఆర్‌ఎస్‌ పార్టీ పై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం అని చెప్పారు.


First Published:  27 Aug 2023 4:45 PM IST
Next Story