ఎమ్మెల్యే టికెట్ల కోసం ఓ రేంజ్‌లో బురద చల్లుకుంటున్నారుగా!
మనకంటే ముందున్న టికెట్ ఆశావహులను వెనక్కి లాగాలి. వాళ్ల తప్పులేమున్నాయో బయటికి తీయాలి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతోందంటున్నారు రాజకీయ నిపుణులు.
రాజకీయం ఓ మత్తు. డబ్బు, పరపతి, హోదా అన్నింటికీ మించి అధికారం ఇచ్చే కిక్కు ఇంకేదీ ఇవ్వదంటారు రాజకీయ నేతలు. అందుకే ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా చివరికి రాజకీయం గూటికే చేరుతున్నారు చాలామంది. రాజకీయాల్లోకి వచ్చాక పదవి దక్కించుకోవాలంటే ఎన్నికల్లో పోటీకి పార్టీ టికెట్ తెచ్చుకోవాలి. మనకంటే ముందున్న టికెట్ ఆశావహులను వెనక్కి లాగాలి. వాళ్ల తప్పులేమున్నాయో బయటికి తీయాలి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతోందంటున్నారు రాజకీయ నిపుణులు.
కబ్జాలు, కమీషన్లు అన్నీ..
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూకబ్జాలు చేశారని ఏకంగా ఆయన కుమార్తె రోడ్డెక్కారు. ఆక్రమణలను తానే తొలగించారు. ఇదంతా జనగామ టికెట్ ఆశిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డే చేయించారని, తన బిడ్డను తన మీదికి ఉసిగొల్పారని ముత్తిరెడ్డి గొల్లుమన్నారు. మరోవైపు ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ భర్త షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ ప్రతి పనికీ కమీషన్ గుంజేస్తున్నారని, హరిప్రియకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని ఆ పార్టీకే చెందిన మున్సిపల్ ఛైర్మన్ డైరెక్ట్ కామెంట్లు చేశారు. మాట వినని నేతలు సొంత పార్టీ వారు అయినా కూడా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించి ఎమ్మెల్యే భర్త వేధిస్తున్నారని మరో బాంబు పేల్చారు.
బానోత్ మదన్‌లాల్ రాసలీలలు.. నెక్స్ట్ లెవెల్
ఇక వైరాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ రాసలీలలు అంటూ కొన్ని ఫొటోలు వైరలవుతున్నాయి. మదన్‌లాల్ ఓ మహిళతో ముద్దు ముచ్చట్లు ఆడుతున్నట్లుగా ఉన్న ఫొటోలను కొందరు బయటపెట్టారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌ను కాదని మదన్‌లాల్‌కు టికెట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, అందుకే మార్ఫింగ్ ఫొటోలతో ఆయన్ను బద్నాం చేయాలని చూస్తున్నారని మదన్‌లాల్ వర్గం చెబుతుంది. టికెట్ల వేటలో ఇంకా ఇలాంటి ఎన్ని జాతకాలు బయటపడతాయోనని జనం కామెంట్ చేస్తున్నారు.