Telugu Global
Telangana

నాడు కాళ్లు పట్టుకున్నోళ్లే నేడు కాలర్ పట్టుకుంటున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త ఉద్యోగం అయినా ఇచ్చినట్టు రుజువు చేయాలని, లేదంటే కేటిఆర్ సవాల్ ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి.

నాడు కాళ్లు పట్టుకున్నోళ్లే నేడు కాలర్ పట్టుకుంటున్నారు
X

ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర యువతను కాంగ్రెస్ నేతలు అవసరానికి వాడుకున్నారని, నేడు వారి జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. నాడు అధికారం కోసం కాళ్లు పట్టుకున్న వారు, నేడు వారి కాలర్ పట్టుకుని కంఠాన్ని నలుపుతున్నారని విమర్శించారు. అప్పుడు అండగా ఉంటామని చెప్పి, ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేస్తున్నారని అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో తెలంగాణ యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు రాకేష్ రెడ్డి.



తెలంగాణలో విడుదలైంది ఉద్యోగాల క్యాలెండర్ కాదని, ఉత్తుత్తి క్యాలెండర్ అని విమర్శించారు రాకేష్ రెడ్డి. అది జాబ్ క్యాలెండర్ కాదని జారుకునే క్యాలెండర్ అని కొత్త నిర్వచనమిచ్చారు. అది కేవలం నిరుద్యోగులకు ఇచ్చిన హామీల నుండి తప్పించుకునే క్యాలెండర్ మాత్రమేనన్నారు. మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ అయినా ఉంటుందని, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుందని.. కానీ కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఇటు జాబ్స్, అటు క్యాలెండర్ రెండూ లేవని సెటైర్లు పేల్చారు రాకేష్ రెడ్డి.


ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడిలాగా కాంగ్రెస్ ముచ్చట ఉందన్నారు రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త ఉద్యోగం అయినా ఇచ్చినట్టు రుజువు చేయాలని, లేదంటే కేటిఆర్ సవాల్ ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46 ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ అరెస్ట్ అయిన 70మంది యువతను బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో పరామర్శించిన రాకేష్ రెడ్డి, కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడించారు. వారికి అండగా ఉంటామని, వారి తరపున జీవో46కి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.

First Published:  4 Aug 2024 4:26 PM IST
Next Story