Telugu Global
Telangana

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు..

రైతులు రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని.. రైతుల నుంచి బీఆర్ఎస్ పట్ల మంచి స్పందన ఉందన్నారు. దేశంలో ప్రతీ మూలకు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తామని చెప్పారు గుర్నామ్ సింగ్.

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు..
X

బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకంతోపాటు, రైతు బీమా పథకాన్ని కూడా అమలు చేస్తామని అన్నారు బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు, పేదలకు అండగా ఉంటోందని పేర్కొన్నారాయన. తెలంగాణలో అందుతున్న సంక్షేమ ఫలాలు దేశం మొత్తం అందించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని వెల్లడించారు.

పీఎం కిసాన్ ఉందిగా..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ఆర్థిక సాయం అందుతోంది. అయితే ఏడాదికేడాది ఇందులో లబ్ధిదారులను తగ్గించేస్తున్నారు. 70వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినా వ్యూహాత్మకంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించేసి తమాషా చూస్తోంది కేంద్రం. తెలంగాణ ప్రభుత్వం విషయానికొస్తే.. ఎక్కడా కొర్రీలు వేయకుండా పొలం ఉన్న ప్రతి రైతుకీ ఏడాదికి ఎకరాకి 10వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కేవలం రైతు బంధుకోసమే ప్రతి ఏడాదీ బడ్జెట్ లో 12వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. రైతులకు అందిస్తున్న ఇతర సాయాలన్నిటితో కలుపుకుంటే.. ఏడాదికి 60వేల కోట్ల రూపాయల మేర రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర్చుతోంది కేసీఆర్ సర్కార్.

కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న కేంద్రం..

పేదలు, రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు లేవని అన్నారు భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం హర్యానా, పంజాబ్, బీహార్, కర్నాటక, మహారాష్ట్ర పై మొదటగా దృష్టి సారించామని చెప్పారు. రైతులు రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని.. రైతుల నుంచి బీఆర్ఎస్ పట్ల మంచి స్పందన ఉందన్నారు. దేశంలో ప్రతీ మూలకు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తామని చెప్పారు. త్వరలోనే కేసీఆర్, బీఆర్ఎస్ విధానాలను ప్రకటిస్తారని తెలిపారు. గుజరాత్ మోడల్ తో బీజేపీ దేశాన్ని అమ్మేసిందని, పంటభూములు, రైళ్లు, పోర్టులు అన్నీ అమ్మేశారన్నారు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం రైతుల పక్షాన ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఫలాలు దేశం మొత్తం అమలు చేస్తామని వెల్లడించారు.

First Published:  23 Dec 2022 8:03 PM IST
Next Story