Telugu Global
Telangana

భావసారూప్యత కలిగిన శక్తుల ఏకీకరణకు గుర్తుగా BRS ఖమ్మం సభ

ఈ సమావేశం జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలలో గణనీయమైన మార్పును సూచించనున్నదని రాజకీయ విశ్లేషకుల భావన. నాలుగు ప్రధాన పార్టీలు - BRS, లెఫ్ట్ పార్టీలు, AAP ,సమాజ్‌వాదీ పార్టీల ఏకీకరణకు వేదికను సృష్టిస్తుంది.

భావసారూప్యత కలిగిన శక్తుల ఏకీకరణకు గుర్తుగా BRS ఖమ్మం సభ
X

జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న చారిత్రాత్మక బహిరంగ సభతో భారత రాష్ట్ర సమితి అధికారికంగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజల ముందు తన‌ ఎజెండా ఉంచనున్నారు. రైతు కేంద్రంగా, అభివృద్ధి కేంద్రంగా సాగే అంశాలను దేశ ప్రజలకు వివరించనున్నారు.

ఈ సమావేశం జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలలో గణనీయమైన మార్పును సూచించనున్నదని రాజకీయ విశ్లేషకుల భావన. నాలుగు ప్రధాన పార్టీలు - BRS, లెఫ్ట్ పార్టీలు, AAP ,సమాజ్‌వాదీ పార్టీల ఏకీకరణకు వేదికను సృష్టిస్తుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఇతర జాతీయ నేతలు హాజరుకానున్నారు.

కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేష్ యాదవ్, ఇతర జాతీయ నాయకులు జనవరి 17 న హైదరాబాద్ రానున్నారు. జనవరి 18 న జరిగే సమావేశానికి ఖమ్మం వెళ్లే ముందు వారు కేసీఆర్ తో పాటు యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. కేరళ ముఖ్య‌ మంత్రి పినరయి విజయన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొందరు ప్రముఖ నాయకులు జనవరి 18న నేరుగా వేదిక వద్దకు చేరుకుంటారు.

జాతీయ నాయకులు ఖమ్మం వెళ్లేందుకు రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమీకృత జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంతోపాటు కంటి వెలుగు పథకం రెండో దశ ప్రారంభోత్సవంలో కూడా వారు పాల్గొంటారు.

కాగా, ఖమ్మం బహిరంగ సభను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు టీ హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ లోక్ సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశానికి నాయకులు, పొరుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను చూసేందుకు హరీష్ రావు గత రెండు రోజులుగా స్థానిక కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

బహిరంగ సభ కోసం ఖమ్మం నగర శివార్లలోని కొత్త జిల్లా సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ సమీపంలోని వి వెంకటాయపాలెంలో 100 ఎకరాల స్థలాన్ని పార్టీ నాయకులు ఇప్పటికే ఖరారు చేశారు. పార్టీ నాయకులు వేదిక ఏర్పాట్లు చూస్తుండగా, పోలీసు అధికారులు పార్కింగ్ కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించారు. ఈ బహిరంగ సభకు కనీసం ఐదు లక్షల మంది జనం హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో వారికి రవాణా సౌకర్యం కల్పించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశానికి పూర్వ ఖమ్మం జిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుండి కూడా ప్రజలు హాజరు కానున్నారు.

First Published:  14 Jan 2023 12:54 PM IST
Next Story