పరేడ్ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ సభకు అనుమతి లభిస్తుందా?
2018 ఎన్నికల సమయంలో పరేడ్ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) సభకు అనుమతి కోరగా ఆర్మీ అధికారులు నిరాకరించారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది. ఖమ్మంలో నిర్వహించిన సభకు 5 లక్షల మందికి పైగా ప్రజలు తరలి వచ్చిన ఉత్సాహంతో త్వరలో నాందేడ్‌లో కూడా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 5న నాందేడ్ సభ తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ లేదా ఢిల్లీలో భారీ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఖమ్మం సభ ఊపుతో.. ఇప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభించిన తర్వాత అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో ఇద్దరు సీఎంలు, జాతీయ నాయకులతో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం సభ లాగానే దీనికి కూడా 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా బీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సభను పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించడానికి ఆర్మీ అధికారులు అనుమతులు ఇస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇక్కడ సభ నిర్వహించాలంటే డిఫెన్స్ మినిస్ట్రీ అనుమతి తప్పనిసరి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో సభకు అనుమతి వస్తుందా లేదా అనే సందిగ్దత నెలకొన్నది.
2018 ఎన్నికల సమయంలో పరేడ్ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) సభకు అనుమతి కోరగా ఆర్మీ అధికారులు నిరాకరించారు. రాజకీయ సభలకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో.. సభను ఎల్బీ స్టేడియంకు మార్చారు. పరేడ్ గ్రౌండ్స్‌లో సభ కోసం అనుమతి కోరతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంలో తమకు అనుమతి ఇవ్వకపోయనా.. గతేడాది జులైలో ప్రధాని మోడీ సభకు ఆర్మీ అధికారులు అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ రాజకీయ సభను బీజేపీ నిర్వహించింది. ఆ తర్వాత కూడా పరేడ్ గ్రౌండ్స్‌లో కొన్ని రాజకీయ సభలకు ఆర్మీ అధికారులు ఓకే చెప్పారు. కాబట్టి ఈ సారి బీఆర్ఎస్‌కు తప్పకుండా అనుమతి లభిస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అనుమతి ఇవ్వకపోతే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని అన్నారు.