Telugu Global
Telangana

బీజేపీని ఆపే సత్తా బీఆర్ఎస్‌కే ఉంది.. ఆ పార్టీతోనే కలిసి నడుస్తాం : సీపీఐ, సీపీఎం ప్రకటన

బీఆర్ఎస్‌తో స్నేహం విషయంలో వెనక్కు తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. పేదల కోసం సీపీఐ, సీపీఎం పార్టీలు అసెంబ్లీ, పార్లమెంటులో పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

బీజేపీని ఆపే సత్తా బీఆర్ఎస్‌కే ఉంది.. ఆ పార్టీతోనే కలిసి నడుస్తాం : సీపీఐ, సీపీఎం ప్రకటన
X

బీజేపీని నిలువరించే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని.. ఆ పార్టీతో తమ స్నేహం కొనసాగిస్తామని సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రకటించాయి. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని.. ఆ ఉద్యమానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో రెండు పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..

బీఆర్ఎస్‌తో స్నేహం విషయంలో వెనక్కు తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. పేదల కోసం సీపీఐ, సీపీఎం పార్టీలు అసెంబ్లీ, పార్లమెంటులో పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. సీట్ల కోసం తాము దిగజారబోమని.. రోజుకో పార్టీ మారే వాళ్లే తమను విమర్శిస్తున్నారని కూనంనేని మండిపడ్డారు. కమ్యూనిస్టులను విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమే అని చెప్పారు.

వామపక్షాలు బీఆర్ఎస్‌కు దూరమయ్యాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల్లో పొత్తులు రాజకీయ విధానాల ప్రాతిపదికనే ఉంటాయి. అంతే తప్ప ఓట్లు, సీట్ల ప్రాతిపదికన కాదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే తమ రాజకీయ విధానం అన్నారు.

బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి.. ఆ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కూడా మా పార్టీల విధానం ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్‌తో స్నేహం ఆ ప్రాతిపదికనే ఏర్పడిందని స్పష్టం చేశారు. ఇకపై కూడా బీఆర్ఎస్‌తో స్నేహం కొనసాగుతుందని వెల్లడించారు.

బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే తాము మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్‌తో ఉన్నామని చెప్పారు. తమకు మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపాదన వచ్చింది. కానీ బీజేపీని ఓడించే సత్తా బీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నదని ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్, కాంగ్రెస్‌కు బీ టీమ్ అంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో సీఎం కేసీఆర్ బలమైన వ్యక్తి అని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

First Published:  1 July 2023 12:54 AM GMT
Next Story