దేశంలో బీజేపీని నిలవరించే సత్తా BRS కు ఉంది - సీపీఐ
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజెపి పగటి కలలు కంటోందని ఇక్కడ ఆ పార్టీకి డబుల్ డిజిట్ కూడా రాదని కూనంనేని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలిందన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిస్తే బీజేపీని ఓడించవచ్చని సాంబశివరావు అన్నారు.
దేశంలో బీజేపీని నిలవరించే సత్తా బీఆరెస్ కు ఉందని సీపీఐ అభిప్రాయపడింది. నరేంద్రమోడీని , బీజేపీని ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్ కు ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం ఆయన కొత్తగూడెం సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజెపి పగటి కలలు కంటోందని ఇక్కడ ఆ పార్టీకి డబుల్ డిజిట్ కూడా రాదని కూనంనేని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలిందన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిస్తే బీజేపీని ఓడించవచ్చని సాంబశివరావు అన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో మోడీ పచ్చి అబద్దాలు చెప్పారని, ఇది బీజేపీ మోసపూరిత విధానాలకు పరాకాష్ట అని సాంబశివరావు మండిపడ్డారు. టిఆర్ఎస్‌తో పొత్తు కొనసాగిస్తూనే రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని కూనంనేని పేర్కొన్నారు.
బీజేపీ వ్యతిరేక పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లు అనేక ఇబ్బందులను సృష్టిస్తున్నారన్నారు. ఫెడరల్ వ్యవస్థకు గవర్నర్ల వ్యవస్థను పూర్తి వ్యతిరేకమని ఆరోపించిన కూనంనేని గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో టీఆరెస్ పార్టీ బీఆరెస్ గా మారడం మంచి పరిణామమని చెప్పిన కూనంనేని, బీఆరెస్ పార్టీకి స్వాగతం పలుకుతున్నామన్నారు.