Telugu Global
Telangana

రుణమాఫీ కాలేదా, ఫోన్ చేయండి.. రైతుల కోసం BRS హెల్ప్‌లైన్‌

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం రైతుబంధు కోసమే సీజన్‌కు రూ.7,500 కోట్ల నిధులు ఖర్చు పెట్టామన్నారు నిరంజన్ రెడ్డి.

రుణమాఫీ కాలేదా, ఫోన్ చేయండి.. రైతుల కోసం BRS హెల్ప్‌లైన్‌
X

రైతు రుణమాఫీపై గందరగోళం నెలకొందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకూ చాలా మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అన్న‌దాత‌ల‌ను మోసం చేశారన్నారు. 8 నెలలు గడిచిన తర్వాత కూడా రైతులకు మేలు జరగడం లేదన్నారు. రుణమాఫీ జరగని రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ తరపున హెల్ప్‌లైన్‌ అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. 83748 52619 నంబర్‌కు ఫోన్ చేసి రైతులు వివరాలు చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రుణాలు మాఫీ జరిగేలా చూస్తామన్నారు.


రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారన్న నిరంజన్‌ రెడ్డి.. ఇప్పటివరకూ 10 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. రైతు రుణమాఫీకి మొదట రూ.40 వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పి తర్వాత రూ.30 వేల కోట్లకు తగ్గించారని, బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రుణమాఫీ కోసం రైతు బంధును అటకెక్కించారన్నారు. కాంగ్రెస్‌ అమలు చేస్తామన్న రైతు భరోసా కోసం ఏటా రూ.30 వేల కోట్లు ఖర్చవుతాయన్నారు. ఇప్పటివరకూ రైతు భరోసాపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే రైతుభరోసాపై జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.


కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం రైతుబంధు కోసమే సీజన్‌కు రూ.7,500 కోట్ల నిధులు ఖర్చు పెట్టామన్నారు నిరంజన్ రెడ్డి. 2014-18 మధ్య రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తేనే రూ.16 వేల కోట్లు ఖర్చయిందన్నారు. కానీ, కాంగ్రెస్‌ రూ.లక్షా 50 వేల వరకు రుణమాఫీ చేశామని చెప్తున్నప్పటికీ.. కేవలం రూ.11 - 12 వేల కోట్లు మాత్రమే ఖర్చయిందన్నారు. ఆంక్షల పేరుతో చాలా మంది రైతులను అనర్హులుగా చేశారని మండిపడ్డారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసిన రైతులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.

First Published:  5 Aug 2024 1:35 PM IST
Next Story