Telugu Global
Telangana

సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కేటీఆర్ పిలుపు

ప్రధాని మోడీ రామగుండం సభలో మాట్లాడుతూ సింగరేణిని ప్రవేటీకరించబోమని హామీ ఇచ్చి ఇప్పుడు మాటతప్పారని కేటీఆర్ మండిపడ్డారు. వేలం లేకుండా సింగరెణికి బొగ్గు గనులు కేటాయించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కేటీఆర్  పిలుపు
X

సింగరేణి బొగ్గు గనులను ప్రవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు నడుం భిగించింది. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర‌సనలు చేపట్టాలని, సింగ‌రేణి ప్రాంతాల్లో మ‌హా ధ‌ర్నాలు చేపట్టాలని బీఆరెస్ నిర్ణయించింది.

మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, కొత్త‌గూడెం, రామ‌గుండం ఏరియాల్లో మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

ప్రధాని మోడీ రామగుండం సభలో మాట్లాడుతూ సింగరేణిని ప్రవేటీకరించబోమని హామీ ఇచ్చి ఇప్పుడు మాటతప్పారని కేటీఆర్ మండిపడ్డారు. వేలం లేకుండా సింగరెణికి బొగ్గు గనులు కేటాయించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

సింగరేణిని ప్రైవేటుకు అప్పగించి, తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని దెబ్బతీయాలని కేంద్ర బీజేపీ సర్కార్ కుట్ర చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు జీవనాడి వంటి సింగరేణి ప్రవేటీకరణ నిర్ణయాన్నికేంద్రం వెనక్కి తీసుకోకుంటే మరో ప్రజా ఉద్యమం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

అటు సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కాగా, బీఆరెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ లో పర్యటిస్తున్నవిషయం గమనార్హం.

First Published:  6 April 2023 5:27 PM IST
Next Story