Telugu Global
Telangana

రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆరెస్

ఇతర రాష్ట్రాల్లో చేపలు ఎండబెట్టే ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడాన్ని సమర్థించినప్పుడు, ఈ పథకం కింద తెలంగాణలో ధాన్యం ఎండబెట్టే ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణాన్ని నిబంధనలకు విరుద్ధం అని ఎలా పేర్కొంటారో వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులందరూ రేపటి నిరసనలలో పాల్గొనాలని కేటీఆర్ కోరారు.

రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆరెస్
X

తెలంగాణలో ఉపాధి హామీ (MGNREGS) నిధులను మళ్లిస్తున్నామంటూ కేంద్రం చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం ప్రదర్శనలు నిర్వహించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.

ఇతర రాష్ట్రాల్లో చేపలు ఎండబెట్టే ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడాన్ని సమర్థించినప్పుడు, ఈ పథకం కింద తెలంగాణలో ధాన్యం ఎండబెట్టే ప్లాట్‌ఫారమ్‌ల (కళ్ళాలు ) నిర్మాణాన్ని నిబంధనలకు విరుద్ధం అని ఎలా పేర్కొంటారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులందరూ రేపటి నిరసనలలో పాల్గొనాలని కేటీఆర్ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం డ్రైయింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.

"మంచి పనిని మెచ్చుకునే బదులు, ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చేందుకు, మాపై ప్రతీకారం తీర్చుకోవడానికి బీజేపీ యమ యాతన‌ పడుతోంది. అదే పథకం కింద ఇతర రాష్ట్రాల్లో చేపలు ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్‌లను (కళ్ళాలు ) నిర్మించడాన్ని పట్టించుకోని కేంద్రం ధాన్యాన్ని ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా తప్పు పడుతుంది "అని ఆయన ప్రశ్నించారు.

MGNREGS ను వ్యవసాయ పనులతో అనుసంధానం చేయాలని, పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని బీఆర్‌ఎస్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే అభ్యర్థిస్తున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, దేశవ్యాప్తంగా అనేక మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారాయన‌.

" కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదు. పైగా బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతూ ఉంటే బీజేపీ తన వైఫల్యాలను అంగీకరించలేక, వ్యవసాయాభివృద్ధిలో రాష్ట్రంతో పోటీ పడలేక తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది'' అని కేటీఆర్ మండిపడ్డారు.

First Published:  22 Dec 2022 7:34 AM GMT
Next Story