8 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘతన బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.. మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 ఏళ్లలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని హరీశ్ రావు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ కంటే తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-లైబ్రరీని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి మెడికల్ కాలేజీని రికార్డు స్థాయిలో 7 నెలల్లోనే పూర్తి చేశామని చెప్పారు. తెలంగాణ రాక ముందు 58 ఏళ్లలో మన ప్రాంతానికి కేవలం మూడు కాలేజీలు మాత్రమే వచ్చాయని.. కానీ నిరుడు ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులు ప్రారంభించుకున్నామని హరీశ్ రావు గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 ఏళ్లలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ లక్ష మందికి 19 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లో లైబ్రరీలతో పాటు ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నదని చెప్పారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. కేవలం మెడికల్ కాలేజీలు మాత్రమే కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ.16.5 కోట్లతో మూడు ఐవీఎఫ్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లు కూడా అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయవచ్చని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంటికే వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ధరణి వల్ల అవినీతి తగ్గడమే కాకుండా.. పారదర్శకత పరిగిందని చెప్పారు. ధరణిని రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే లంచాలను మళ్లీ తేవడమే అని మంత్రి స్పష్టం చేశారు. హరిత హారం కారణంగా రాష్ట్రంలో 7 శాతం అడవులు పెరిగినట్లు మంత్రి వెల్లడించారు.