Telugu Global
Telangana

పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణకు అడుగులు.. ప్రగతిభవన్‌లో కేసీఆర్ కీలక సమావేశాలు

నేతలు, రైతు సంఘం నాయకులతో ఇంద్రకరణ్ సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను ఈ పర్యటనలో వారికి వివరించారు.

పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణకు అడుగులు.. ప్రగతిభవన్‌లో కేసీఆర్ కీలక సమావేశాలు
X

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను పొరుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు వడి వడిగా అడుగులు పడుతున్నాయి. మొదటి నుంచి మహారాష్ట్రను తొలి ఛాయిస్‌గా ఎంపిక చేసుకున్న సీఎం కేసీఆర్ ఆ మేరకు ముందస్తు ప్రక్రియ మొదలు పెట్టడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. గురువారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పర్యటించిన ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక నేతలతో సమావేశం అయ్యారు. ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణలోని నిర్మల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకాలో ఆయన పర్యటించారు.

స్థానిక నేతలు, రైతు సంఘం నాయకులతో ఇంద్రకరణ్ సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను ఈ పర్యటనలో వారికి వివరించారు. ఈ నెలాఖరులోగా ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్‌లు ఏర్పాటు చేస్తామని అధినేత కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా, హర్యానా, పంజాబ్, ఏపీల్లో బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మహారాష్ట్ర కిసాన్ సెల్ ఏర్పాటులో భాగంగానే ఇంద్రకరణ్ పర్యటన జరిగినట్లు తెలుస్తున్నది.

గతంలో నాందేడ్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన లోకల్ లీడర్లు, రైతులు ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేయడానికి అనుమతి ఇవ్వమని కోరారు. ఆనాడు టీఆర్ఎస్ పట్ల ఆసక్తి చూపించిన వారిని ఏకతాటిపైకి తీసుకొని రావడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు వంటి సంక్షేమ పథకాల పట్ల మహారాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. ముధోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి కూడా ఈ పర్యటనలో ఉన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశమంతా అమలు చేయాలనే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినట్లు ఆయన స్థానికులకు వివరించారు.

కేసీఆర్‌ను కలిసిన ఏపీ బీసీ నేతలు..

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను ఏపీకి చెందిన బీసీ నేతలు ప్రగతిభవన్‌లో కలిశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నేతల బృందాన్ని క్రిష్ణా జిల్లా షీప్ బ్రీడర్స్ కోఆపరేటీవ్ యూనియన్ మాజీ చైర్మన్ గురిపాటి రామకృష్ణాయాదవ్ తీసుకెళ్లారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ఏపీలో కూడా చాలా మందిని ఆకర్షిస్తున్నాయని వాళ్లు కేసీఆర్‌కు వివరించారు. దేశమంతటా ఈ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు కేసీఆర్‌కు చెప్పారు.

ఏపీ పద్మశాలీ అసోసియేషన్ రాష్ట్ర నేతలు దివి కోటేశ్వరరావు, వలను కొండ మల్లేశ్వరరావు, సామాజిక కార్యకర్తల తోటకూర కోటేశ్వరరావు, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, బీసీ అసోసియేషన్ లీడర్ రామనాథం అంజన్ రావుతో పాటు మరి కొంత మంది బీసీ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే బీసీల మద్దతు ఉంటుందని వారు కేసీఆర్‌కు చెప్పారు. తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా బీసీల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే బాగుంటుందని వారు సూచించారు. బీసీ నేతల విన్నతులు అన్నీ కేసీఆర్ నోట్ చేసుకొని.. రాబోయే రోజుల్లో కలిసి పని చేద్దామని చెప్పినట్లు తెలుస్తున్నది.

First Published:  23 Dec 2022 8:12 AM IST
Next Story