Telugu Global
Telangana

గోషా మహల్ లో బీజేపీకి షాకిచ్చిన బీఆర్ఎస్

రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయకపోవడం, స్థానిక నేతలంతా బీఆర్ఎస్ వైపు వచ్చేస్తుండటంతో.. గోషా మహల్ లో కమలం వాడిపోయే స్టేజ్ కి వచ్చేసిందనే వార్తలు వినపడుతున్నాయి.

గోషా మహల్ లో బీజేపీకి షాకిచ్చిన బీఆర్ఎస్
X

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక సీటు గోషామహల్. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో రెండు సీట్లు కమలం ఖాతాలో పడినా.. గోషామహల్ మాత్రం ఆ పార్టీకి ప్రత్యేకం. అయితే విచిత్రంగా ఆ సింగిల్ సీటు విషయంలో ఇప్పుడు బీజేపీ నానా తంటాలు పడుతోంది. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, అరెస్ట్ అయి జైలుకెళ్లడంతో ఆయన్ను సస్పెండ్ చేసిన పార్టీ.. ఇంకా సస్పెన్షన్ ఎత్తివేయలేదు. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ కార్యక్రమాలేవీ జరగడంలేదు. పార్టీతో సంబంధం లేకుండానే ఉంటున్నారు రాజాసింగ్.

కర్నాటకలో ప్రచారం చేయించుకున్నా..

విచిత్రం ఏంటంటే.. కర్నాటక ఎన్నికల్లో రాజాసింగ్ తో బీజేపీ ప్రచారం చేయించుకుంది. ఇటు తెలంగాణలో సస్పెన్షన్ కొనసాగుతూనే ఉన్నా.. ఆయన్ను మాత్రం అక్కడ ప్రచారానికి వాడుకుంది. రోజులు గడుస్తున్నా సస్పెన్షన్ ఎత్తేయకపోవడంతో రాజాసింగ్ వర్గం బాగా డల్లయిపోయింది. దీంతో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అధికార పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ పనులు చేయించుకుంటున్నారు. కేవలం కార్పొరేటర్లే కాదు, స్థానిక నేతలు కూడా బీజేపీకి దూరం జరుగుతున్నారు.

రాజాసింగ్ వర్సెస్ విక్రమ్ గౌడ్..

గోషా మహల్ లో రాజాసింగ్ కి వచ్చే దఫా టికెట్ ఇవ్వకపోతే తాను బీజేపీ తరపున రంగంలోకి దిగుతానంటున్నారు మాజీ మంత్రి ముకేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్. ఆమేరకు ఆయన పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపినా కూడా అక్కడినుంచి అనుమతి రాలేదు. తనను ఇన్ చార్జ్ గా ప్రకటిస్తే ప్రజల్లోకి వెళ్తానని చెబుతున్నారు విక్రమ్ గౌడ్. అధిష్టానం మాత్రం అటు రాజాసింగ్ కి, ఇటు విక్రమ్ గౌడ్ కి.. ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కాలం గడుపుతోంది. ఈ దశలో గోషా మహల్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. పార్టీ నాయకత్వం ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోషా మహల్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అక్కడి బీజేపీ నేతలను బీఆర్ఎస్ వైపు వచ్చేలా ఆకర్షిస్తున్నారు.

2018 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న ఏకైక సీటు ఈసారి ఆ పార్టీకి దక్కే ఛాన్స్ లేదంటున్నారు విశ్లేషకులు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయకపోవడం, స్థానిక నేతలంతా బీఆర్ఎస్ వైపు వచ్చేస్తుండటంతో.. గోషా మహల్ లో కమలం వాడిపోయే స్టేజ్ కి వచ్చేసిందనే వార్తలు వినపడుతున్నాయి.

First Published:  21 May 2023 3:32 PM GMT
Next Story