మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ.. పంచాయతీ ఎన్నికల్లో తొలి విజయం
మహారాష్ట్రలో బీఆర్ఎస్ కి మంచి టీమ్ దొరికిందనే విషయం స్పష్టమవుతోంది. పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించకముందే పంచాయతీ ఎన్నికల్లో తొలి విజయం సాధించింది.
నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం తొలిరోజే ఆ పార్టీకి శుభవార్త వినపడింది. మహారాష్ట్ర పంచాయతీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గఫర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పార్టీ తరపున బోణీ కొట్టారు. ఛత్రపతి శంభాజీ నగర్ పరిధిలోని గంగాపూర్ తాలూకా అంబెలోహల్ గ్రామ పంచాయతీకి నిన్న ఉప ఎన్నిక జరగగా ఈరోజు రిజల్ట్ వచ్చింది, మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ కొట్టింది.
ఛత్రపతి శంభాజీ నగర్ లో గత నెలలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. మహారాష్ట్రపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే చేరికలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, కోఆర్డినేటర్ల నియామకం జరిగింది. మహిళా విభాగం, రైతు విభాగం కూడా పటిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం నాందేడ్ లో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం మొదలైంది. ఇది పూర్తయిన తర్వాత నెలరోజులపాటు పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుంది. ఆలోగా మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ అభివృద్ధి మోడల్ పై చర్చ జరిగేలా చేయాలనుకుంటున్నారు కేసీఆర్.
టీమ్ మహారాష్ట్ర..
మహారాష్ట్రలో బీఆర్ఎస్ కి మంచి టీమ్ దొరికిందనే విషయం స్పష్టమవుతోంది. పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించకముందే పంచాయతీ ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీనుంచి కూడా పేరున్న నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వీరిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత ముందు పొరుగు రాష్ట్రాల్లో బలపడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బరిలో దిగలేదు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకోసం మాత్రం గులాబి దండు సిద్ధమవుతోంది. అందుకే వరుస మీటింగ్ లతో మహారాష్ట్రలో తెలంగాణ అభివృద్ధి మోడల్ ని ప్రచారం చేస్తున్నారు కేసీఆర్. మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ తో సంచలనం సృష్టించబోతున్నారు.