Telugu Global
Telangana

దేశ వ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించేందుకు BRS కసరత్తు

రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఇతర రాష్ట్రాల్లో భారీ సభలను నిర్వహించాలని BRS నాయకులు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, ఢిల్లీ ల్లో సమావేశాలను ఏర్పాటు చేయబోతోంది.

దేశ వ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించేందుకు BRS కసరత్తు
X


రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా ఫిబ్రవరి 17న హైదరాబాద్ లో జరగాల్సిన బీఆరెస్ బహిరంగ సభ వాయిదా వేయవలసి వచ్చింది. అయితే పార్టీ ఇతర రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.

BRS ఇప్పటికే తెలంగాణలోని ఖమ్మం, మహారాష్ట్రలోని నాందేడ్‌లో రెండు భారీ బహిరంగ సభ‌లను నిర్వహించింది. వీటికి ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి భారీ సభలను నిర్వహించాలని BRS నాయకులు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, ఢిల్లీ ల్లో సమావేశాలను ఏర్పాటు చేయబోతోంది.

హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 17న జరగాల్సి ఉండిన‌ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జేడీ (యు) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, BR అంబేద్కర్ మనవడు, సామాజిక కార్యకర్త-రాజకీయవేత్త ప్రకాష్ అంబేద్కర్ తదితరులు హాజరవుతారని ప్రకటించారు.

అయితే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవంతో పాటు ఈ సభ కూడా వాయిదా పడింది. బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించగా, అదే రోజు బీఆర్‌ఎస్ బహిరంగ సభ కూడా జరపాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో వస్తామని హామీ ఇచ్చిన నాయకులనే కాకుండ మరి కొందరు జాతీయ స్థాయి నేతలను కూడా సభకు రప్పించాలని బీఆరెస్ ప్లాన్ చేస్తున్నది.

ఇక ప్రస్తుతానికి ఇతర రాష్ట్రాల్లో బహిరంగ సభలపై పార్టీ దృష్టి సారించింది. “ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఢిల్లీలో బహిరంగ సభలు జరుగనున్నాయి. మేము వాటిపై పని చేస్తున్నాము. ఆ సభలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తాము. ప్రతి బహిరంగ సభల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరి పార్టీ పునాదులను బలోపేతం చేయనున్నారు’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు ప్రముఖ పత్రికతో చెప్పారు.

ఏప్రిల్, మే నెలల్లో ఒడిశా, కర్ణాటకలో మరో రెండు బహిరంగ సభలు, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మరో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించినట్లుగా, మేలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం BRS నాయకులు JD (S) తరపున‌ ప్రచారం చేయాలని భావిస్తున్నారు. అలాగే కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRS అరంగేట్రం చేయవచ్చు.

కర్ణాటక ఎన్నికల సందర్భంగా మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని జెడి(ఎస్) తరపున తనతో సహా పార్టీ నేతలు ప్రచారం చేస్తారని బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగు మాట్లాడే నియోజకవర్గాల్లో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో డజనుకు పైగా స్థానాల్లో పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

First Published:  20 Feb 2023 7:24 AM IST
Next Story