రుణమాఫీపై ఇంటింటికి బీఆర్ఎస్.. కేటీఆర్ కీలక నిర్ణయం
మొదటగా ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో వివరాలు సేకరిస్తామన్నారు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు కేటీఆర్.
తెలంగాణలో రూ. 2 లక్షల రుణమాఫీపై గందరగోళం నెలకొంది. రుణమాఫీ పూర్తి చేశామని కాంగ్రెస్ చెప్తుంటే.. లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ చెప్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నేతలు రాజీనామా సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై చర్చించారు.
సంపూర్ణ రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేసేందుకు తెలంగాణ భవన్‌లో సమావేశమైన అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు pic.twitter.com/WY1bjeGpoe
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2024
సమావేశం అనంతరం మీడియాతో చిట్‌చాట్ చేసిన కేటీఆర్.. రైతు రుణమాఫీపై ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తామని చెప్పారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. మొదటగా ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో వివరాలు సేకరిస్తామన్నారు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు కేటీఆర్. అప్పటికీ రైతులకు న్యాయం జరగకుంటే ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.
మరోవైపు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో ప్రకటన చేస్తున్నారు. 22 లక్షల మంది రైతులకు రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని, మిగిలిన వారికి త్వరలో చేస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తుంటే.. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి చెప్పారు.