Telugu Global
Telangana

రాహుల్‌, కొండా సురేఖలపై BRS ఫిర్యాదు.. కారణం ఇదే.!

దురుద్దేశపూర్వకంగా కేసీఆర్‌ను ట్యాపింగ్ అంశంతో ముడిపెట్టారని.. అప్పటి పోలీసు,ఇంటెలిజెన్స్ వర్గాలను దుర్వినియోగం చేశారంటూ రాహుల్‌గాంధీ కామెంట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాహుల్‌, కొండా సురేఖలపై BRS ఫిర్యాదు.. కారణం ఇదే.!
X

కాంగ్రెస్‌ సీనియర్ లీడర్‌ రాహుల్‌ గాంధీ, మంత్రి కొండా సురేఖలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్‌. తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో బీఆర్ఎస్ పార్టీపైనా, కేసీఆర్ పైనా రాహుల్‌గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌ ఫిర్యాదు చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఫిర్యాదు కాపీకి జత చేశారు.

దురుద్దేశపూర్వకంగా కేసీఆర్‌ను ట్యాపింగ్ అంశంతో ముడిపెట్టారని.. అప్పటి పోలీసు,ఇంటెలిజెన్స్ వర్గాలను దుర్వినియోగం చేశారంటూ రాహుల్‌గాంధీ కామెంట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేల మంది ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందారని ఆరోపించారు రాహుల్‌. అయితే ఈ ఆరోపణలన్ని నిరాధారం, అర్థరహితమన్నారు బీఆర్ఎస్‌ నేతలు. విచారణలో ఉన్న అంశంపై వ్యాఖ్యలు చేయడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన రాహుల్‌గాంధీని ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని కోరారు బీఆర్ఎస్ నేతలు.


ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై.. మంత్రి కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేశారని, విచారణ చేపట్టి మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కొండా సురేఖపై మరో లేఖ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్‌ నేతలు.

First Published:  9 April 2024 8:46 AM IST
Next Story