బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు ఫైనల్.. స్వయంగా ప్రకటించిన కేసీఆర్
హైదరాబాద్ నందినగర్‌లోని RS ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని BSP ప్రతినిధుల బృందం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. లంచ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు మధ్య పొత్తు ఖరారైంది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఏయే సీట్లలో పోటీ చేయాలనే అంశంపై బుధవారం ప్రకటన చేస్తామన్నారు. రెండు పార్టీల మధ్య గౌరవప్రదంగా సీట్ల పంపకం ఉంటుందన్నారు కేసీఆర్. మాయవతితో తాను ఇంతవరకు మాట్లాడలేదన్నారు కేసీఆర్.
అంతకుముందు హైదరాబాద్ నందినగర్‌లోని RS ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని BSP ప్రతినిధుల బృందం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. లంచ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, లోక్‌సభ ఎన్నికలు, పొత్తు అంశాలపై చర్చించారు.
ఇక RS ప్రవీణ్ కుమార్ నాగర్‌కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. R.S. ప్రవీణ్ కుమార్ సొంత గ్రామం అలంపూర్ నాగర్‌కర్నూలు నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 44 వేలకు పైగా ఓట్లు సాధించి.. మూడో ప్లేసులో నిలిచారు.
మరోవైపు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 19కిపై ఎస్సీ నియోజకవర్గాలుంటే బీఆర్ఎస్ కేవలం రెండు అలంపూర్, స్టేషన్ ఘన్‌పూర్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు కలిసి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఎస్పీ చాలా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది.