Telugu Global
Telangana

ఆ నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్ ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో త్రిబుల్ డిజిట్ లక్ష్యం!

2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవని.. ఇప్పటికీ ప్రతిపక్షాలు బలంగా ఉన్న సెగ్మెంట్లను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఆ నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్ ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో త్రిబుల్ డిజిట్ లక్ష్యం!
X

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పడింది. మరి కొద్ది నెలల్లోనే అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని.. తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే సర్వేలు చేయిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో త్రిబుల్ డిజిట్ మార్క్ అందుకోవాలంటే గతంలో టీఆర్ఎస్ గెలవని నియోజకవర్గాలపై పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అనుకుంటున్నారు.

2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవని.. ఇప్పటికీ ప్రతిపక్షాలు బలంగా ఉన్న సెగ్మెంట్లను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఇంచార్జులను ప్రజల్లోకి వెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని ఆదేశించారు. గతంలో చేసిన తప్పులు చేయకుండా.. పక్కా వ్యూహంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని స్థానిక నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలపై కేసీఆర్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లనున్నారు. అక్కడ ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బీఆర్ఎస్ గెలిచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలు ప్రతిపక్షాల ఖాతాలో పడకుండా వ్యవహరించనున్నారు.

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలలో పని తీరు బాగా లేని వారిని పిలిచి ఇప్పటికే క్లాస్ తీసుకున్నారు. వెంటనే వ్యవహార శైలి మార్చుకోవాలని ఘాటుగానే హెచ్చరించినట్లు తెలుస్తున్నది. ఒక వేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మార్పు రాలేదని తేలితే మాత్రం.. కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే దాదాపు టికెట్లు ఖరారవుతాయని పార్టీలో చర్చ జరుగుతున్నా.. పని తీరు బాగా లేని వారిని మాత్రం ఈ సారి మర్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఘన విజయం సాధించేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో విజయం పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని.. సార్వత్రిక ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విజయాన్ని చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

First Published:  5 March 2023 12:17 PM IST
Next Story