బీఆర్ఎస్ లిస్ట్ రెడీ.. రాత్రి లేదా రేపు ప్రకటించే ఛాన్స్
శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఏ క్షణమైనా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. సెప్టెంబర్‌లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండగా.. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశముందని పార్టీలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. జాబితా కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఏ క్షణమైనా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. దాదాపు 112 స్థానాలకు అభ్యర్థులను గులాబీ బాస్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి లేదా రేపు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనే కేసీఆర్ చెప్పినట్లుగా.. దాదాపు 95 శాతం సిట్టింగ్‌లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. ఆరు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారని.. ఓ జెడ్పీ ఛైర్‌పర్సన్‌కు, ఓ ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేశారని తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ స్థానం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు స్థానాలు, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొ స్థానంలో అభ్యర్థుల మార్పు ఉండే అవకాశాలున్నాయి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ ఓ చోట సిట్టింగ్‌ను తప్పిస్తారని తెలుస్తోంది. ఇక టికెట్ ఆశిస్తున్న పలువురు కీలక నేతలను బుజ్జగించే ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక మిగిలిన స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. గత ఆరు నెలల కాలంలో పలు నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు పలు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అయితే అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా ఏకంగా 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి సంచలనం సృష్టించారు. లాస్ట్ టైం కూడా శ్రావణ మాసంలోనే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక అభ్యర్థుల ప్రకటన కోసమే మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.
రుణమాఫీ పూర్తి, గృహలక్ష్మీ, పెన్షన్ల పెంపు, బీసీ, మైనార్టీలకు లక్ష సాయం లాంటి పథకాలను ప్రకటించి జోరు మీదున్న బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలను సైతం ఉద్ధృతం చేయనుంది. ఇక మంత్రి కేటీఆర్ సైతం ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్లేనని ఇటీవల హింట్ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సిరిసిల్లలో పర్యటించిన మంత్రి కేటీఆర్ఎ న్నికల ప్రచారం ఎప్పుడూ సారంపల్లి నుంచే ప్రారంభిస్తాను. పంద్రాగస్టు, సర్వాయి పాపన్న ఆశీస్సులు, గౌడ సోదరుల అభిమానంతో ఈ సారి కూడా సారంపల్లి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్టు భావించి ఆశీర్వదించండంటూ ప్రకటించారు.