Telugu Global
Telangana

అసెంబ్లీ ఘటనపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు.. సీఎం దిష్టిబొమ్మల దహనం

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది.

అసెంబ్లీ ఘటనపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు.. సీఎం దిష్టిబొమ్మల దహనం
X

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి. ఆ వ్యాఖ్యలతో నిండు సభలోనే ఎమ్మెల్యే సబిత కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆమెకు మద్దతుగా సభ నుంచి బయటకు వచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించారు. వెంటనే మహిళా ప్రజా ప్రతినిధులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై ఒత్తిడి పెంచే క్రమంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్.


సీఎం వ్యాఖ్యలు కేవలం ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల గురించి కాదని, తెలంగాణ మహిళలందర్నీ ఆయన అవమానించారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిన్నచూపు ఇప్పుడు అందరికీ అర్థమైందని అంటున్నారు. తెలంగాణలోని మహిళలందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాలని అంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకోసం తొలిసారిగా బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు. ఊరూవాడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి నేతలంతా మహిళల పక్షాన రోడ్డుపైకి వస్తున్నారు. ఈరోజు నిరసన కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలు స్థానికంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దిష్టిబొమ్మలు దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు.

First Published:  1 Aug 2024 6:57 AM IST
Next Story